మటన్ లో కొరోనా వైరస్ ఉన్నట్టు ఎటువంటి ఆధారం లేదు. సరిగ్గా వేడిచేసిన మాంసం తినడం హానికరం కాదు

‘మటన్ లోకి వచ్చిన కొరోనా వైరస్’ అని చెప్తూ, ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మటన్ లోకి వచ్చిన కొరోనా వైరస్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో ఎడిట్ చేయబడింది. అంతేకాదు, అది ఐదారేళ్ల క్రితం తీసిన ఫోటో. సరిగ్గా వేడిచేసిన మాంసం తినొచ్చని FSSAI మరియు WHO వారు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్టులోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి ఫోటోతో కూడిన ‘జస్ట్ డయల్’ వెబ్ సైట్ లింక్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. కానీ, పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్నన్ని మచ్చలు ఒరిజినల్ ఫోటోలో ఉండవు. కేవలం ఒక్క చోట మాత్రమే కొన్ని మచ్చలు ఉన్నట్టు ఒరిజినల్ ఫోటోలో చూడవొచ్చు. అంతేకాదు, ఒరిజినల్ ఫోటోని ‘జస్ట్ డయల్’ వెబ్సైటులో పెట్టిన ‘Khaja A – 1 Mutton Shop’ వారికి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, ఆ ఫోటోను సుమారు ఐదారేళ్ల క్రితం తీసినట్టుగా తెలిపారు. కానీ, కొరోనా వైరస్ (కోవిడ్-19) గత సంవత్సరం డిసెంబర్ లో మొదటిసారి రిపోర్ట్ అయ్యింది. కావున, సోషల్ మీడియాలో ఒరిజినల్ ఫోటోని ఎడిట్ చేసి, కొరోనా వచ్చినట్టు షేర్ చేస్తున్నారు.

చికెన్, మటన్ మరియు ఇతర నాన్-వెజ్ ఆహారాలు తినడం ద్వారా కొరోనా వైరస్ వ్యాపిస్తుందని ఎటువంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవని FSSAI ( Food Safety and Standards Authority of India) సి‌ఈ‌ఓ జీ. ఎస్. జీ. అయ్యంగార్ తెలిపారు.

అంతేకాదు, సరిగ్గా వేడి చేసిన మాంసం తినవచ్చని FSSAI పెట్టిన ప్రెస్ రిలీజ్ లో మరియు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) వెబ్ సైట్ లో చూడవొచ్చు.

చికెన్, మటన్, చేపలు మరియు గుడ్లు తినడం ద్వారా కొరోనా వైరస్ వస్తుందని చెప్పడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కూడా ట్వీట్ చేసారు

ఇంతకముందు, చికెన్ లో కొరోనా వైరస్ దొరికిందని కొన్ని మెసేజ్లు వైరల్ అయినప్పుడు, అవి ఫేక్ అని FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘మటన్ లోకి వచ్చిన కొరోనా వైరస్’ అంటూ పెట్టిన ఫోటో ఎడిట్ చేయబడింది. సరిగ్గా వేడిచేసిన మటన్ తినొచ్చు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?