కర్ణాటకలోని చిక్కోడిలో పాకిస్తాన్ జెండాలను ఎగురవేశారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియోలో కనిపిస్తున్నవి ఇస్లామిక్ జెండాలు

కర్ణాటకలోని చిక్కోడి పట్టణంలో రోడ్డు మధ్యలోని వీధిలైట్ల స్తంభాలకు పాకిస్తాన్ జెండాలను కట్టారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కర్ణాటకలోని చిక్కోడిలోని వీధిలైట్ల స్తంభాలకు పాకిస్థాన్ జెండాలను కట్టిన దృశ్యాలు.

ఫాక్ట్: వీడియోలో కనిపిస్తున్నవి పాకిస్తాన్ జెండాలు కావు. అవి ఇస్లామిక్ జెండాలు. మిలాద్-ఉన్-నబి పండుగ సందర్భంగా అనుమతి తీసుకొని స్థానికులు ఈ జెండాలను ఏర్పాటు చేశారని చిక్కోడి పోలీసులు తెలిపారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోలోని జెండాను పాకిస్తాన్ జెండాతో పోల్చి చూడగా, అది పాకిస్థాన్ జెండా కాదని తెలుస్తుంది. పాకిస్తాన్ జెండాలో ఉండే తెల్లటి పట్టీ ఈ జెండాలో లేకపోవడం చూడవచ్చు.

ఇక వీడియోలో ఉన్న జెండా గురించి మరింత పరిశోధించగా ఇది ఇస్లాం మతానికి చెందిన జెండా అని తెలిసింది. ప్రధానంగా, ఇస్లాం మతపరమైన వేడుకల్లో ఈ జెండాని ప్రదర్శిస్తారు. గతంలో ఈ జెండాను అనేక చోట్ల ఎగురవేసిన సందర్భాల్లో కూడా ఇది పాకిస్తాన్ జెండా అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పుడు మేము అనేక ఫాక్ట్- చెక్ కథనాలు ప్రచరించాం. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇక వైరల్ వీడియోలోని దృశ్యాలను చిక్కోడి గూగుల్ స్ట్రీట్ వ్యూ దృశ్యాలతో పోల్చిచూడగా వైరల్ వీడియో చిక్కోడి పట్టణానికి చెందినదిగా నిర్ధారించాం. ఈ  విషయం గురించి మేము చిక్కోడి పోలీసులను సంప్రదించగా వాళ్లు స్పందించలేదు. అయితే, విశ్వాస్ న్యూస్ ఇదివరకే చిక్కోడి పోలీసులను సంప్రదించగా మిలాద్-ఉన్-నబి పండుగ సందర్భంగా అనుమతి తీసుకొని స్థానికులు ఈ జెండాలను ఏర్పాటు చేశారని, ఇవి పాకిస్తాన్ జెండాలు కావని స్పష్టం చేశారు.

చివరిగా, కర్ణాటకలోని చిక్కోడిలో పాకిస్తాన్ జెండాలను ఎగురవేశారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియోలో కనిపిస్తున్నవి ఇస్లామిక్ జెండాలు.