భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని, భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యతిరేకించానని స్వయంగా చెప్పారు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో నెహ్రూ “నేను స్వాతంత్ర్య పోరాటంలో అస్సలు పాల్గొనలేదు. నిజానికి ఆయన దానిని వ్యతిరేకించాడు(I wasn’t involved in the fight for independence at all; in fact, he opposed it)” అని చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: భారత స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని జవహర్‌లాల్ నెహ్రూ అంగీకరించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. ఈ వీడియోలోని దృశ్యాలు నెహ్రూ మరణానికి కొద్ది రోజుల ముందు, అమెరికన్ టీవీ హోస్ట్ ఆర్నాల్డ్ మిచ్ కు నెహ్రూ ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించినవి. ఈ ఇంటర్వ్యూ వీడియోలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి భారత స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని నెహ్రూ అంగీకరించారని అర్థం వచ్చేలా రూపొందించారు. వాస్తవంగా ఈ ఇంటర్వ్యూలో నెహ్రూ మాట్లాడుతూ, “Mr. Jinnah was not involved in the fight for Independence at all. In fact, he opposed it.” ( Mr. జిన్నా స్వాతంత్ర్య పోరాటంలో అస్సలు పాల్గొనలేదు. నిజానికి, అతను దానిని వ్యతిరేకించాడు) అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం, పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని 14 మే 2019న ‘ Prasar Bharati Archives’ (భారత ప్రభుత్వ యొక్క అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ) తమ అధికారిక YouTube ఛానెల్‌లో “Jawaharlal Nehru’s Last TV Interview – May 1964” అనే శీర్షికతో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియో నెహ్రూ మరణానికి కొద్ది రోజుల ముందు, అమెరికన్ టీవీ హోస్ట్ ఆర్నాల్డ్ మిచ్ కు నెహ్రును ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించినది అని తెలుస్తుంది.
ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, ఈ వైరల్ వీడియో క్లిప్ టైమ్‌స్టాంప్ 14:50 వద్ద ప్రారంభమై టైమ్‌స్టాంప్ 15:45 వద్ద ముగుస్తుందని తెలిసింది. వాస్తవంగా, వీడియో యొక్క ఈ భాగంలో నెహ్రూ ముస్లిం లీగ్‌కు చెందిన ప్రముఖ నాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా గురించి ప్రస్తావించడం మనం గమనించవచ్చు. టైమ్‌స్టాంప్ 14:35 నుండి ఇంటర్వ్యూయర్ , నెహ్రూ మధ్య జరిగిన సంభాషణ మరియు ఈ సంభాషణ యొక్క తెలుగు అనువాదం కింద చదవొచ్చు.
ఇంటర్వ్యూయర్: “You and Mr. Gandhi and Mr. Jinnah. You were all involved at that point of Independence and then partition….in the fight for Independence of India from the British domination.” (మీరు, గాంధీ, జిన్నా ముగ్గురూ అప్పుడు బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర కోసం పోరాటం చేసారు మరియు తరువాత విభజనలో కూడా పాల్గొన్నారు).
నెహ్రు: “Mr. Jinnah was not involved in the fight for Independence at all. In fact, he opposed it. Muslim League was started in about 1911, I think. It was started really by the British, encouraged by them so as to create factions…. they did succeed to some extent. And ultimately, there came the partition.” (జిన్నా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. నిజానికి అతను వ్యతిరేకించాడు. ముస్లిం లీగ్‌ని సుమారు 1911 సమయంలో బ్రిటిష్ వారు మొదలుపెట్టారు; వివిధ వర్గాలుగా విడగొట్టడానికి. వారు కొంతవరకు విజయం కూడా సాధించారు. చివరకు, విభజన జరిగింది)
దీన్ని బట్టి, ఈ ఇంటర్వ్యూ వీడియోలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి భారత స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని నెహ్రూ అంగీకరించారని అర్థం వచ్చేలా రూపొందించారని మనం నిర్థారించవచ్చు. నెహ్రూ జిన్నా గురుంచి చేసిన వ్యాఖ్యలను తన గురుంచే చేసినట్టు ఎడిట్ చేసిన వీడియో వైరల్ చేస్తున్నారు.
గతంలో భారతదేశ విభజన జరగడానికి తానే స్వయంగా నిర్ణయం తీసున్నానని ఓ ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్పారు అని క్లెయిమ్ చేస్తూ ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ కాగా దాన్ని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, భారత స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా చెప్పారంటూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.