ఇండోనేషియాలోని బాలీ సముద్రంలో ఉన్న 5,000 సంవత్సరాల నాటి శ్రీ మహా విష్ణు దేవాలయం వీడియో అని AI వాడి జనరేట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు

కొందరు స్కూబా డైవర్లు సముద్రంలో ఈదుతూ, సముద్ర మట్టాన ఉన్న ఒక దేవాలయాన్ని పరిశీలిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోనేషియాలోని బాలీ సముద్రంలో ఉన్న 5,000 సంవత్సరాల నాటి శ్రీ మహా విష్ణు దేవాలయానికి చెందిన వీడియో ఇది అని చెప్తూ యూజర్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇండోనేషియాలోని బాలీ సముద్రంలో ఉన్న 5,000 సంవత్సరాల నాటి శ్రీ మహా విష్ణు దేవాలయానికి చెందిన వీడియో

ఫ్యాక్ట్(నిజం): ఇది AI ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని mbaiarts అనే ఆర్టిస్ట్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. 5,000 సంవత్సరాల నాటి శ్రీ మహా విష్ణు దేవాలయాన్ని ఇండోనేషియా సముద్రంలో కనుగొన్నట్టు ఆధారాలు లేవు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. 

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి అందులో కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మాకు దొరికింది. ఈ వీడియోని mbaiarts అనే పేజీ వారు 9 ఏప్రిల్ 2025న అప్లోడ్ చేశారు. ఈ ప్రొఫైల్ యొక్క వాటర్‌మార్క్ మనకి వైరల్ వీడియోలో కూడా కనిపిస్తుంది (@mbaiarts)

ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసినవి అని ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యొక్క వివరణలో ఉంది. ఈ పేజీలో AI ఉపయోగించి తయారు చేసిన చాలా వీడియోలు ఉన్నాయి. అలాగే, ఈ పేజీ యొక్క బియోలో ‘artist’అని కూడా రాసి ఉంది.

ఈ వీడియో 99% AI ఉపయోగించి తయారు చేసినది అని, AI జనరేట్ వీడియోలను డిటెక్ట్ చేసే ‘Hive’ అనే టూల్ నిర్ధారించింది.

ఇక వైరల్ వీడియోలో చెప్తున్నట్లుగా, ఇండోనేషియాలో బాలీ సముద్రంలో 5,000 సంవత్సరాల నాటి శ్రీ మహా విష్ణు దేవాలయం ఉందా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా, మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేదా ఆధారాలు దొరకలేదు.  

గతంలో ఒక గజ ఈతగాడు ఇండోనేషియాలోని పెముటేరన్ సముద్రంలో ఈత కొడుతూ 5,000 సంవత్సరాల నాటి ఒక పురాతన హిందూ దేవాలయాన్ని కనుగొన్నారు అని ఒక వీడియో వైరల్ అయ్యింది. అయితే అందులోని దృశ్యాలు ఒక అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌లోని విగ్రహాలని చూపిస్తుందని చెప్తూ మేము ఒక ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ రాశాము. దీన్ని 2005లో ‘రీఫ్ గార్డెనర్స్’ అనే కమ్యూనిటి ప్రాజెక్టులో భాగంగా కృత్రిమంగా నిర్మించారు.

చివరగా, ఇండోనేషియాలో బాలీ సముద్రంలో ఉన్న 5,000 సంవత్సరాల నాటి శ్రీ మహా విష్ణు దేవాలయం వీడియో అని AI వాడి జనరేట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు.