ఢిల్లీ సీఎం రేఖా గుప్తా డాన్స్ చేస్తున్న వీడియో అంటూ సంగీత మిశ్రా అనే కంటెంట్ క్రియేటర్ డాన్స్ చేస్తున్న వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

20 ఫిబ్రవరి 2025న ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా గతంలో నృత్యం చేస్తున్న దృశ్యాలు అంటూ వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా నృత్యం చేస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో నృత్యం చేస్తున్న మహిళ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కాదు. ఈ వైరల్ వీడియోలో నృత్యం చేస్తున్న మహిళ పేరు సంగీత మిశ్రా, ఆమె సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో నృత్యం చేస్తూ కనిపిస్తున్న మహిళకు, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు మధ్య ఎలాంటి పోలికలు లేకపోవడం మనం గమనించవచ్చు. తదుపరి ఈ వైరల్ వీడియోకు ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వైరల్ వీడియోను (ఆర్కైవ్) 17 ఫిబ్రవరి 2025న సంగీత మిశ్రా (sangeeta_mishra05) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసినట్లు కన్నుగొన్నాము.

సంగీత మిశ్రా ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలించగా, ఆమె ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అని, ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోలను తరుచూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తుందని మేము కనుగొన్నాము. సంగీత మిశ్రా డ్యాన్స్ చేస్తున్న పలు ఇతర వీడియోలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. అలాగే సంగీత మిశ్రాకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఇందులో కూడా ఆమె డ్యాన్స్ చేస్తున్న  వీడియోలను షేర్ చేసింది (ఇక్కడ).

వైరల్ వీడియోలో నృత్యం చేస్తున్న మహిళను (సంగీత మిశ్రా) ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పోల్చి చూస్తే ఇద్దరు వేరు వేరు మహిళలు లని స్పష్టమవుతుంది. వీరిద్దరి ఫోటోల మధ్య పోలిక క్రింద చూడవచ్చు.

రేఖా గుప్తా హర్యానాలోని జింద్ జిల్లాలో 1974లో జన్మించారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి మర్లేనా తర్వాత ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా 20 ఫిబ్రవరి 2025న ప్రమాణస్వీకారం చేశారు. వార్తా కథనాల ప్రకారం, రేఖా గుప్తా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేపథ్యం నుంచి వచ్చారు. 1996-97లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నుంచి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, రేఖ గుప్తా షాలిమార్ బాగ్ స్థానం నుండి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందన కుమారిని దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కత్తి సాము చేస్తున్న వీడియో అంటూ ఓ వీడియో వైరల్ అవ్వగా, ఆ వీడియోలో ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కాదని, అందులో ఉన్న మహిళ మరాఠీ నటి పాయల్ జాదవ్ వీడియో అని చెప్తూ Factly రాసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నృత్యం చేస్తున్న వీడియో అంటూ సంగీత మిశ్రా అనే కంటెంట్ క్రియేటర్ నృత్యం చేస్తున్న వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.