ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచబోతుందని ఒక నకిలీ జీవో ప్రచారంలో ఉంది

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పంచే అవకాశాన్ని పరిశీలించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ జీవోని జారీ చేసిందని ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పంచే అవకాశాన్ని పరిశీలించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఫాక్ట్: ఇది నకిలీ జీవో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెక్ విభాగం స్పష్టం  చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలని పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన G.O. Rt. No.1545ని మార్ఫింగ్ చేసి ఈ నకిలీ జీవోని రూపొందించారు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ పోస్టులో పేర్కొన్న జీవో నెంబరుతో (G.O. Rt. No.1575) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక జీవో వెబ్సైట్‌లో వెతకగా ఐఏఎస్ అధికారి ఇంటి అద్దె చెల్లింపు గురించి 28 ఆగష్టు 2025న జారీ చేయబడిన సంబంధంలేని జీవో లభించింది. ఇందులో ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన అంశాలు లేవు.

అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ 22 ఆగష్టు 2025న G.O. Rt. No.1545ని జారీ చేసింది. దీనికి సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

వైరల్ పోస్టులోని జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెక్ విభాగం స్పందిస్తూ, అది నకిలీ జీవో అని స్పష్టం చేసింది. జీవో నెం.1545లోని నెంబరును, తేదీని, వయసు వివరాలను మార్పింగ్ చేసి ఈ నకిలీ జీవోని రూపొదించారని, ఇలాంటి ఫేక్ పోస్టులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

2022లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ అప్పటి వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు వర్తించదని, ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్ల ఉద్యోగుల సర్వీసు నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.

జూలై 2023లో కూడా అప్పటి వైకాపా ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచిందని తప్పుడు ప్రచారం జరిగినప్పుడు మేము రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచబోతుందని ఒక నకిలీ జీవో ప్రచారంలో ఉంది.