ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కౌన్సిలర్ ఒక పోలీసు అధికారిని కొడుతున్న అక్టోబర్ 2018 వీడియోను పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్‌గా తప్పుగా షేర్ చేస్తున్నారు

పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్ యూనిఫాంలో ఉన్న పోలీసుపై దాడి చేశాడని క్లెయిమ్ చేస్తూ, ఒక వ్యక్తి పోలీసుని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్ ఒక పోలీసును కొడుతున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో పోలీసును కొట్టింది పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్ కాదు. అసలు ఈ ఘటన జరిగింది 2018లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరి. అతను ఓ హోటల్‌లో తన స్నేహితుడితో కలిసి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్‌తో సర్వీస్ ఆలస్యం విషయంపై జరిగిన వాదనలో గొడవకు దిగాడు. దీంతో మనీష్ చౌదరి సబ్ ఇన్స్పెక్టర్‌ను కొట్టాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

“పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్ పోలీసును కొట్టారా?” అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు.

మన్సూర్ మొహమ్మద్ దిమిర్ అనే పేరుగల MLA ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి మేము పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రస్తుత సభ్యుల జాబితాను తనిఖీ చేసాము. అయితే, ఆ పేరు జాబితాలో లేదు.

ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా,20 అక్టోబర్ 2018న ప్రచురించబడిన డైనమైట్ న్యూస్  కథనం లభించింది.  దాని ప్రకారం, ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఒక బీజేపీ కౌన్సిలర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ మధ్య చోటు చేసుకుంది అని తెలిసింది.

ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, అక్టోబర్ 2020లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరి. హోటల్‌కు సబ్ ఇన్స్పెక్టర్ పన్వార్ తన స్నేహితుడితో వచ్చినప్పుడు, సర్వీస్ ఆలస్యం కారణంగా జరిగిన వాగ్వాదంలో మనీష్ పాల్గొన్నాడు. ఈ వివాదం తీవ్రరూపం తీసుకొని, మనీష్ చౌదరి సబ్ ఇన్స్పెక్టర్‌పై దాడి చేశాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

గతంలో ఇదే వీడియో వైసీపీ నాయకుడు ఒక పోలీసును కొట్టాడనే వాదనలతో వైరల్ అయినప్పుడు, Factly దానిని ఫాక్ట్ – చెక్ చేసింది.

చివరిగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కౌన్సిలర్ ఒక పోలీసు అధికారిని కొడుతున్న అక్టోబర్ 2018 వీడియోను పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్‌గా తప్పుగా షేర్ చేస్తున్నారు.