వీధి కుక్కలు వెంబడించడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ కంగారులో కారుని ఢీ కొట్టిన ఈ ఘటన హైదరాబాద్‌కు సంబంధించినది కాదు

హైదరాబాద్ గాంధీ నగర్ కాలనీలో వీధి కుక్కలు వెంబడించడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ కంగారులో పార్క్ చేసి ఉన్న కారుని ఢీ కొట్టి ఎగిరిపడిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం

క్లెయిమ్: హైదరాబాద్ గాంధీ నగర్ కాలనీలో కుక్కలు వెంబడించడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ కంగారులో కారుని ఢీ కొట్టి గాయపడిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన ఒడిషా రాష్ట్రంలోని బెహ్రంపూర్‌ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(PTI) వార్తా సంస్థ 03 ఏప్రిల్ 2023 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. ఒడిషా రాష్ట్రంలోని బెహ్రంపూర్‌ నగరంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళలను కుక్కలు వెంబడించడంతో వారు కంగారులో పార్క్ చేసి ఉన్న కారుని ఢీ కొట్టి ఎగిరి పడిన దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ PTI రిపోర్ట్ చేసింది.

ఈ వీడియోలోని ఘటన ఒడిషా రాష్ట్రంలోని బెహ్రంపూర్‌ నగరంలో చోటుచేసుకుందని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ప్రమాదం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోలేదని తెలంగాణ ప్రభుత్వ ఫాక్ట్-చెక్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ట్వీట్ చేసింది.

ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుందని మొట్టమొదట రిపోర్ట్ చేసిన ‘Way2News’ పోర్టల్ తాము రిపోర్ట్ చేసిన సమాచారం తప్పని, ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుందని స్పష్టం చేస్తూ ట్వీట్ పెట్టింది.

చివరగా, వీధి కుక్కలు వెంబడించడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ కంగారులో కారుని ఢీ కొట్టిన ఈ వీడియో హైదరాబాద్‌కు సంబంధించినది కాదు.