ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్’లో హైజాకర్లకు ఉపయోగించిన భోలా, శంకర్ పేర్లు హైజాకింగ్ సమయంలో హైజాకర్లు ఉపయోగించిన మారుపేర్లు

ఉగ్రవాదాన్ని వైట్‌వాష్ చేయడం కోసం హిందువులను లక్ష్యంగా చేసుకున్న మరోనెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ IC814 ది కాందహార్ హైజాక్.అసలు హైజాకర్స్ ముస్లిములు, కానీ ఈ సీరీస్ లో హైజాకర్లు హిందువులు అని చూపించారు. హైజాకర్ల అసలు పేర్లు ఇబ్రహీం అక్తర్ (బహవల్పూర్ ), షాహిద్ అక్తర్ సయీద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ (ముగ్గురూ కరాచీ నుండి)షకీర్ (సుక్కుర్ నుండి). వీరందరూ పాకిస్తాన్ వాళ్ళే.కానీ సిరీస్ లో చూపించిన హిందూ పేర్లు; భోలా,శంకర్, బర్జర్, కథను పూర్తిగా వక్రీకరించారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల 29 ఆగస్ట్ 2024న విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్, ‘IC 814: ది కాందహార్ హైజాక్’,లో హైజాకర్స్ యొక్క ముస్లిం గుర్తింపును దాచడానికి, ఈ వెబ్ సిరీస్‌లో హైజాకరలకు భోలా, శంకర్, బర్జర్ అనే హిందూ పేర్లను ఉపయోగించారు.

ఫాక్ట్(నిజం): ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్’లోని హైజాకర్ల పేర్లు హైజాకింగ్ సమయంలో హైజాకర్లు ఉపయోగించిన మారుపేర్లు. 06 జనవరి 2000న IC-814 విమానం హైజాకింగ్‌ ఘటనపై అప్పటి కేంద్ర హోం మంత్రి ప్రకటన, ఇతర రిపోర్ట్స్ ప్రకారం, ఫ్లైట్ IC-814 హైజాకింగ్‌కు సంబంధించిన ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సున్నీ అహ్మద్‌ ఖాజీ, మిస్త్రీ జహూర్‌ ఇబ్రహీం, షకీర్‌. అయితే, హైజాకింగ్ సమయంలో హైజాకర్లు ఒకరినొకరు సంబోధించడానికి చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా మరియు శంకర్ అనే పేర్లను ఉపయోగించారని తెలిసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

24 డిసెంబర్ 1999న,  నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారతదేశంలోని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC-814 విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు భారతీయ విమానాన్ని హైజాక్ చేశారు . హైజాకర్లు విమానాన్ని అమృత్ సర్, లాహోర్, దుబాయిల మీదుగా చివరకు తాలిబాన్-నియంత్రిత ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదిగా ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజహర్‌తో పాటు తమ సహచరులు 36 మందిని విడుదల చేయాలని అలాగే 200 మిలియన్ డాలర్లు (రూ. 1400 కోట్లు) ఇవ్వాలని హైజాక‌ర్లు భారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక వీరి డిమాండ్లకు ఒప్పుకున్న భారత ప్రభుత్వం మసూద్‌ అజహర్‌తో, ముస్తాక్ అహ్మద్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ షేక్ లను పాటు ఇతర ఉగ్రవాదులను విడుదల చేసింది.

ఇకపోతే ఈ వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 06 జనవరి 2000న IC-814 విమానం హైజాకింగ్‌ ఘటనపై అప్పటి కేంద్ర హోం మంత్రి ప్రకటనను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసిన పత్రిక ప్రకటన ఒకటి లభించింది. ఈ ప్రకటన IC-814 హైజాకింగ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. ఈ పత్రిక ప్రకటన ప్రకారం, ముంబై పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల సహాయంతో హర్కత్-ఉల్-అన్సార్ (HuA ) కార్యకర్తలను ముంబైలో పట్టుకున్నారని, వీరిని మహ్మద్ రెహాన్, మహ్మద్ ఇక్బాల్, యాసుఫ్ నేపాలీ, అబ్దుల్ లతీఫ్‌లుగా గుర్తించారని, ఈ నలుగురు హర్కత్-ఉల్-అన్సార్ (HuA )కార్యకర్తలు హైజాకర్లకు సపోర్ట్ సెల్‌గా వ్యవహరించారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.   

అలాగే ఈ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం, ఈ నలుగురు హర్కత్-ఉల్-అన్సార్ (HuA )కార్యకర్తలు ఫ్లైట్ IC-814 హైజాకింగ్‌కు సంబంధించిన ఐదుగురు ఉగ్రవాదుల పేర్లును ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సున్నీ అహ్మద్‌ ఖాజీ, మిస్త్రీ జహూర్‌ ఇబ్రహీం, షకీర్‌ అకా రాజేష్ గోపాల్ వర్మ అని పేర్కొన్నారు అని వెల్లడించింది.

అలాగే, హైజాక్ సమయంలో ఇబ్రహీం అథర్ ను – చీఫ్ (chief) అని, షాహిద్ అక్తర్ సయ్యద్ ను – డాక్టర్(Doctor) అని, సున్నీ అహ్మద్‌ ఖాజీను – బర్గర్(Burger), మిస్త్రీ జహూర్‌ ఇబ్రహీంను – భోలా(Bhola) అని మరియు షకీర్‌ అకా రాజేష్ గోపాల్ వర్మను – శంకర్(Shankar) అని హైజాకర్లు ఒకరినొకరు  సంబోధించుకున్నారు అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

హైజాకింగ్ సమయంలో ఫ్లైట్ కెప్టెన్ గా ఉన్న దేవీ శరణ్ బుక్ “Flight into fear : the captain’s story ఆధారంగా ఈ  ‘IC 814: ది కాందహార్ హైజాక్’ సిరీస్ రూపొందించబడింది అని తెలుస్తుంది. ఈ బుక్ ను మేము పరిశీలించగా, ఇందులో కూడా హైజాకర్లు ఒకరినొకరు సంబోధించడానికి చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా మరియు శంకర్ పేర్లను ఉపయోగించారని, అయితే వారి అసలు పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సున్నీ అహ్మద్‌ ఖాజీ, మిస్త్రీ జహూర్‌ ఇబ్రహీం, షకీర్‌ అని పేర్కొన్నారు.

IC 814 విమానం హైజాకింగ్ సమయంలో ఫ్లైట్ చీఫ్ ఇంజనీర్ గా ఉన్న అనిల్ K జగ్గియా, 2021లో మొత్తం హైజాక్ ఎపిసోడ్‌లో తన అనుభవాన్ని వివరిస్తూ “IC 814 Hijacked: The Inside Story” అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో కూడా మనం హైజాకర్లు ఒకరినొకరు సంబోధించడానికి చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా మరియు శంకర్ అనే పేర్లను ఉపయోగించారని పేర్కొన్నారు.

అలాగే IC 814లో ప్రయాణించిన పలువురు ప్రయాణికులు కూడా హైజాకర్లు ఒకరినొకరు సంబోధించడానికి చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా మరియు శంకర్ పేర్లను ఉపయోగించారని పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ) .

ఫ్లైట్ IC 814 హైజాక్‌పై “173 Hours in Captivity: The Hijacking of IC814” పుస్తకాన్ని వ్రాసిన రచయిత, గీత రచయిత మరియు పాత్రికేయుడు నీలేష్ మిశ్రా కూడా హైజాక్ సమయంలో హైజాకర్లు ఒకరినొకరు సంబోధించడానికి చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా మరియు శంకర్ పేర్లను ఉపయోగించారని పేర్కొన్నారు. దీన్ని బట్టి హైజాకర్లు ఉపయోగించిన కోడ్ పేర్లను ఉపయోగించి ఈ వెబ్ సీరిస్ చిత్రీకరించారని మనం నిర్ధారించవచ్చు.

పలు రిపోర్ట్స్ ప్రకారం, అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేసిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్’లోని వివాదాస్పద అంశాలపై వివరణ కోరుతూ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు నోటీసు జారీ చేస్తూ, ఈ వివాదానికి దారితీసిన అంశాలపై 03 సెప్టెంబర్ 2024న వివరణ ఇవ్వమని కోరినట్లు తెలుస్తుంది (ఇక్కడ, & ఇక్కడ). ఇందుకు నెటిఫ్లిక్స్ స్పందిస్తూ, వెబ్ సిరీస్ మొదట్లో ఉగ్రవాదుల అసలు పేర్లును వివరణలో ఇస్తారని పేర్కొంది.

చివరగా, ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్’లో హైజాకర్లకు ఉపయోగించిన భోలా, శంకర్ పేర్లు హైజాకింగ్ సమయంలో హైజాకర్లు ఉపయోగించిన మారుపేర్లు.