ఏప్రిల్ 2025లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర భారత రూపాయల్లో 3,500గా ఉంది అనే వాదన సరైనది కాదు

“భారతదేశం యొక్క పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 14 కేజీల ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధర ₹ 3500 రూపాయలుగా ఉంది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,500 INR (భారతీయ రూపాయలు).

ఫాక్ట్(నిజం): భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర 3,500 భారత రూపాయలు (INR) అనే వాదన సరైనది కాదు. ప్రస్తుతం ఏప్రిల్ 2025లో భారతదేశంలో 14.2 కిలోల సబ్సిడీ లేని LPG గ్యాస్ సిలిండర్ ధర రూ. 853 INR (ఢిల్లీలో ధర). అంటే, భారతదేశంలో ఒక కిలో LPG గ్యాస్ ధర సుమారు రూ. 60 INR. అదే విధంగా కిలో LPG గ్యాస్ ధర పాకిస్తాన్‌లో సుమారు రూ. 76 INR , బంగ్లాదేశ్‌లో సుమారు రూ. 85 INR. అంటే ఏప్రిల్ 2025లో, 14.2 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర పాకిస్తాన్‌లో సుమారు  రూ. 1081 INR, బంగ్లాదేశ్‌లో సుమారు రూ. 1215 INR. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల 07 ఏప్రిల్ 2025న, కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది,  ఈ పెంపు 08 ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వచ్చింది (ఇక్కడ, ఇక్కడ). ఈ పెంపు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుందని కేంద్ర పెట్రోలియం & సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.853కి చేరుకుంది, అలాగే ఉజ్వల పథకం కింద LPG గ్యాస్ సిలిండర్ ధర రూ.500 నుండి రూ.550కి పెరిగింది (ఇక్కడ). ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం, సబ్సిడీ లేని 14.2 కిలోల LPG గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర ఢిల్లీలో రూ. 853, కోల్‌కతాలో రూ. 879, ముంబైలో రూ. 852.50 మరియు హైదరాబాద్‌లో రూ. 905 గా ఉంది.

ఇకపోతే వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో LPG గ్యాస్ సిలిండర్ ధర 3,500 భారత రూపాయలుగా ఉందా అని తెలుసుకోవడానికి, మేము ముందుగా పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్ ధరలను నియంత్రించే పాకిస్తాన్ ఆయిల్ & గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ  యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాము. ఈ వెబ్‌సైట్ ప్రకారం, ఏప్రిల్ 2025లో పాకిస్తాన్‌లో కిలో LPG గ్యాస్ ధర అన్ని పన్నులతో కలిపి గరిష్టంగా 248.37 పాకిస్తాన్ రూపాయలు, అంటే పాకిస్తాన్‌లో 14.2 కిలోల LPG గ్యాస్ సిలిండర్ ధర సుమారు 3526 పాకిస్తాన్ రూపాయలు. ప్రస్తుత మారకం రేటు ప్రకారం, పాకిస్తానీ రూపాయి విలువ దాదాపు 0.30675 భారతీయ రూపాయలు (1 PKR = 0.30675 INR). దీని ప్రకారం, పాకిస్తాన్‌లో 14.2 కిలోల LPG గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర సుమారు రూ. 1081 INR (భారత రూపాయలు).

ఏప్రిల్ 2025లో ప్రచురించబడిన పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థల కథనాల ప్రకారం, ప్రస్తుతం అనగా ఏప్రిల్ 2025లో బంగ్లాదేశ్‌లో 12 కిలోల LPG గ్యాస్ ధర 1,450 టాకాలు (ఇక్కడ, ఇక్కడ). తదుపరి మేము బంగ్లాదేశ్‌లో చమురు, గ్యాస్ ధరలను నియంత్రించే బంగ్లాదేశ్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాము. ఈ వెబ్‌సైట్ ప్రకారం, ఏప్రిల్ 2025లో బంగ్లాదేశ్‌లో 12 కిలోల LPG గ్యాస్ ధర గరిష్టంగా 1,450 టాకాల వరకు ఉంది, అంటే బంగ్లాదేశ్‌లో ఒక కిలో LPG గ్యాస్ ధర దాదాపు 121 టాకా, అంటే 14.2 కిలోల LPG గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 1715 టాకాలు. ప్రస్తుత మారకం రేటు ప్రకారం, ఒక టాకా విలువ దాదాపు 0.70821 భారతీయ రూపాయలు (1 BDT = INR 0.70821). దీని ప్రకారం, బంగ్లాదేశ్‌లో 14.2 కిలోల LPG గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర దాదాపు రూ. 1215 INR (భారత రూపాయలు).

చివరగా, భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర 3,500 భారత రూపాయలు అనే వాదన సరైనది కాదు.