వై.ఎస్.జగన్ “సంక్షేమం” అనే పదాన్ని కూడా సరిగ్గా పలకలేకపోతున్నారంటూ ఒక క్లిప్ చేయబడ్డ వీడియోని షేర్ చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి “సంక్షేమం” అనే పదాన్ని పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.  

A person sitting in a chair with his arms crossed

AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: “సంక్షేమం”అనే పదాన్ని సరిగ్గా పలకలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఫాక్ట్: ఇది ఒక క్లిప్ చేయబడ్డ వీడియో. పూర్తి వీడియోలో జగన్ చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఎగతాళి చేస్తూ అనుకరించడం చూడవచ్చు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో (ఇక్కడ & ఇక్కడ) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 05 మార్చి 2025న ప్రత్యక్షప్రసారం చేసినట్లు గుర్తించాం. ఈ వీడియోలో జగన్ మీడియా సమావేశంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం చూడవచ్చు.

ఈ వీడియోలో 47:58 వద్ద 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని చెప్తూ, సూపర్ సిక్స్ హామిల గురించి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన రెండు ప్రసంగాలతో కూడిన వీడియోని ప్రదర్శించారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను తీసుకువస్తానని మొదటి ప్రసంగంలో చంద్రబాబు చెప్పడం చూడవచ్చు. అలాగే, సూపర్ సిక్స్ హామీలను అమలు చెయ్యాలంటే భయమేస్తుందని రెండో ప్రసంగంలో చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడం చూడవచ్చు.

ఇక ఈ వీడియోని ప్రదర్శించాక జగన్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు, “చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఇవి. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు, 143 హామీలు, ఇవి కాక, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీ(పథకం) కొనసాగుతుంది. ఇవి కాక… ఇంకా మెరుగైన… సంక్షేమం కూడా అనలేదు… సంక్ష్లేమం… (నవ్వుతూ) సమీక్షేమేం… పథకాలు ఇస్తాడని చెప్పాడు. తర్వాత ఇదే పెద్దమనిషి అసెంబ్లీలో సూపర్ సిక్స్ చెప్పాం, సూపర్ సెవెన్ చెప్పాం కానీ చూస్తే భయమేస్తుందని అన్నాడు.”  దీన్ని బట్టి జగన్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని ఎగతాళి చేస్తూ అనుకురరించారని నిర్ధారించవచ్చు.

చివరిగా, వైఎస్ జగన్ “సంక్షేమం” అనే పదాన్నికూడా సరిగా పలకలేకపోతున్నారని ఒక క్లిప్ చేయబడ్డ వీడియోని షేర్ చేస్తున్నారు.