ఢిల్లీలో యమునా హారతి కార్యక్రమం ఫిబ్రవరి 2025లో మొదటిసారిగా నిర్వహించలేదు

ఫిబ్రవరి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి, 27 ఏళ్ల తర్వాత రాజధాని ఢిల్లీలో తిరిగి అధికారాన్ని పొందింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని యమునా ఘాట్లలో మొదటిసారిగా యమునా హరతి నిర్వహించబడిందని క్లెయిమ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ)  వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫిబ్రవరి 2025లో, ఢిల్లీలోని యమునా ఘాట్లలో మొదటిసారిగా యమునా హారతి నిర్వహిస్తున్నట్లు చూపించే వీడియో. 

ఫాక్ట్(నిజం):  ఢిల్లీలో యమునా హారతి ఇటీవల మొదటిసారి జరగలేదు. ఢిల్లీ ప్రభుత్వం 13 నవంబర్ 2015న కుదేసియా ఘాట్‌లో మొట్టమొదటిసారి యమునా హారతి నిర్వహించింది. ఈ వైరల్ వీడియోను ISBT కాశ్మీరీ గేట్ సమీపంలోని ఉన్న వాసుదేవ్ ఘాట్ వద్ద చిత్రీకరించారు. ఈ  ఘాట్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చొరవతో అభివృద్ధి చేసి 12 మార్చి 2024న ప్రారంభించారు. ఈ ఘాట్‌లో ప్రతి ఆదివారం, మంగళవారం యమునా హారతి జరుగుతుంది. అంతేకాకుండా, వాసుదేవ ఘాట్ వద్ద యమునా హారతి నిర్వహిస్తున్న పాత వీడియోలు కూడా మాకు లభించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే నవంబర్ 2021లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) లభించాయి. ఈ వార్త కథనాల ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వం 13 నవంబర్ 2015న కుదేసియా ఘాట్‌లో మొట్టమొదటిసారి యమునా హారతిని నిర్వహించింది. ఇది నదుల శుభ్రపరచడం, పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా జరిగింది. వారణాసి, రిషికేశ్‌లలో గంగా హారతి నుండి ప్రేరణ పొందిన ఈ వేడుకను అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించారు. గీతా ఘాట్‌లో కూడా మొదటి యమునా హారతి కార్యక్రమాన్ని కేజ్రీవాల్ నిర్వహించారు.

వైరల్ వీడియోలో ఉన్న లొకేషన్ ఢిల్లీలోని ISBT కాశ్మీరీ గేట్ సమీపంలోని వాసుదేవ ఘాట్‌గా మేము గుర్తించాము. వాసుదేవ ఘాట్ వద్ద యమునా హారతి నిర్వహిస్తున్న పాత వీడియోలను (ఇక్కడ, ఇక్కడ) కూడా కనుగొన్నాము. వాసుదేవ ఘాట్ వద్ద పాత యమునా హారతి వీడియో యొక్క స్క్రీన్‌షాట్, వైరల్ వీడియో యొక్క స్క్రీన్‌షాట్ పోలికను క్రింద చూడవచ్చు.

వివిధ వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ) ప్రకారం, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సూచనల మేరకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వాసుదేవ ఘాట్‌ను నిర్మించింది. ఈ ఘాట్ 12 మార్చి 2024న ప్రారంభించబడింది. వాసుదేవ ఘాట్ వద్ద ప్రతి ఆదివారం, మంగళవారం యమునా హారతి జరుగుతుంది అని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేయబడిందో మేము స్వతంత్రంగా నిర్ధారించలేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఆధారాలు బట్టి  ఫిబ్రవరి 2025కి ముందు కూడా ఢిల్లీలో యమునా హారతి నిర్వహించబడిందని మనం నిర్థారించవచ్చు.

చివరిగా, ఢిల్లీలో యమునా హారతి కార్యక్రమం ఫిబ్రవరి 2025లో మొదటిసారిగా నిర్వహించలేదు. ఢిల్లీలో యమునా హారతి నవంబర్ 2015లో మొదటిసారిగా జరిగింది.