శీతాకాల అయనాంతం(Winter Solstice) రోజున ఉత్తరార్ధ గోళంలో ఉన్న అన్ని ప్రదేశాల్లో 16 గంటల పాటు రాత్రి, 8 గంటల పగలు ఉండదు, ఇది ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది

21 డిసెంబర్ 2024 తారీఖున మనకి సుదీర్ఘమైన రాత్రి ఉండబోతుంది అని క్లెయిమ్ చెప్తున్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా జరగడాన్ని అయనాంతం అని అంటారు అని, దీని మూలంగా ఈ నెల 21వ తేదీన మనకి 8 గంటల పగలు, 16 గంటల పాటు రాత్రి ఉంటుంది అని ఈ పోస్టులో చెప్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.  

క్లెయిమ్: 21 డిసెంబర్ 2024 తారీఖున 8 గంటల పగలు, 16 గంటల పాటు రాత్రి ఉంటుంది. దీనికి కారణం శీతాకాల అయనాంతం(Winter Solstice).

ఫ్యాక్ట్(నిజం): శీతాకాల అయనాంతం ప్రతి ఏడాది డిసెంబర్ 21వ తారీఖున సంభవిస్తుంది(కొన్ని సార్లు తేదీ మారుతుంది.) ఈ సమయంలో భూమి యొక్క ఉత్తర ధ్రువం సూర్యుడికి దూరంగా వంగి ఉంటుంది. ఈ కారణంగా శీతాకాల అయనాంతం సంభవించే రోజు భూమి ఉత్తరార్ధ గోళంలో ఉండే ప్రదేశాల్లో సంవత్సరంలోనే అతి తక్కువ పగటి సమయం ఉంటుంది. కానీ, ఆ పగలు ఎన్ని గంటలు ఉంటుంది అనేది ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. వైరల్ పోస్టులో చెప్తున్నట్లు అన్ని చోట్లా 8 గంటలు పగలు, 16 గంటల పాటు రాత్రి ఉండదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

వైరల్ పోస్టులో చెప్తున్న దాని పేరు అయనాంతం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ), ఇది సంవత్సరంలో రెండు సార్లు సంభవిస్తుంది. ఒకటి శీతాకాలంలో, మరోటి వేసవి కాలంలో, వీటిని వేసవి అయనాంతం(జూన్ నెలలో), శీతాకాల అయనాంతం(డిసెంబర్ నెలలో) అని పిలుస్తారు. 

వైరల్ పోస్టులో వివరిస్తున్నది శీతాకాల అయనాంతం గురించి. ఇది సంభవించే రోజున భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో(భూమధ్య రేఖకు ఉండే పై భాగం(ఇక్కడ)) ఉన్న ప్రదేశాల్లో సంవత్సరంలోనే అతి తక్కువ పగటి పూట ఏర్పడుతుంది. అంటే ఆరోజు ఏడాది మొత్తంతో పోలిస్తే, పగటి గంటలు తక్కువ ఉంటాయి, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది.  

దీనికి కారణం, భూమి యొక్క ఉత్తరార్ధ గోళం సూర్యుడికి దూరంగా ఉండటమే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి దాదాపు 365 రోజులు పడుతుంది, అలాగే తన అక్షం చుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది. భూమి తన అక్షం(యాక్సిస్)కి 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. 

ఇలా ఒక వైపుకి వంగి ఉన్న భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు కొన్ని నెలల పాటు ఉత్తర ధ్రువం సూర్యుడికి దూరంగా ఉంటుంది, ఈ సమయంలో దక్షిణ ధ్రువం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. అలాగే, కొన్ని నెలలపాటు ఉత్తర ధ్రువం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, ఆ సమయంలో దక్షిణ ధ్రువం దూరంగా ఉంటుంది. దీని వల్లే మనకి రకరకాల ఋతువులు లేదా కాలాలు (సీజన్స్) ఉంటాయి.  ఈ ఏడాది(2024) శీతాకాల అయనాంతం 21 డిసెంబర్ తారీఖున రానుంది (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ).

శీతాకాల అయనాంతం సంభవించే రోజు (ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా 22 తరిఖుల్లో) భూమి యొక్క ఉత్తర ధ్రువం సూర్యునికి అతి దూరంగా ఉంటుంది. ఆరోజున సూర్యుడు దక్షిణార్ధ గోళంలో (భూమధ్య రేఖకు ఉండే కింది భాగం) ఉండే కర్కాటక రేఖ(Tropic of Capricorn) ప్రదేశంలో మధ్యాహ్నం పూట సరిగ్గా 90 డిగ్రీల పైన ఉంటాడు(ఇక్కడ, ఇక్కడ,ఇక్కడ, మరియు ఇక్కడ). ఆ రోజున ఉత్తరార్ధ గోళంలో ఉన్న ప్రదేశాల్లో(భారత్ కూడా ఉత్తరార్ధ గోళంలో ఉంటుంది) సంవత్సరంలోనే అతి తక్కువ పగటి సమయం ఉంటుంది. ఇదే రోజు దక్షిణార్థ గోళంలో ఉన్న వారికి వేసవి అయనాంతం.

కానీ వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా అన్ని చోట్లా 8 గంటల పగలు, 16 గంటల పాటు రాత్రి ఉండదు. ఎన్ని గంటలు పగలు, ఎన్ని గంటలు రాత్రి ఉంటుంది అనే విషయం, ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది(ఇక్కడ). శీతాకాల అయనాంతం రోజున  ఉత్తర ద్రువానికి దగ్గరగా ఉండే ప్రదేశాలకి పగటి పూట చాలా తక్కువగా ఉంటుంది, ఉత్తర ధృవం నుండి భూమధ్య రేఖ వైపుకి వచ్చే కొద్ది పగటి సమయం పెరుగుతుంది. శీతాకాల అయనాంతం రోజున ఉత్తరార్ధ గోళంలో ఉండే అన్ని ప్రదేశాల్లో అతి తక్కువ పగటి వేళ ఉంటుంది. NASA ప్రకారం శీతాకాల అయనాంతం సంభవించే దినాన భూమధ్య రేఖకు పైన ఉన్న ప్రదేశాలు అంటే ఉత్తరార్ధ గోళంలో ఉండే ప్రదేశాలు 12 గంటల కంటే తక్కువ సూర్యకాంతిని చూస్తాయి. 

ఉదాహరణకి లండన్లో  21 డిసెంబర్ 2024న 7 గంటల 49 నిమిషాల 42 సెకన్ల పాటు పగటివేళ ఉంటే, అమెరికాలో ఉన్న అలస్కాలో సూర్యుడు 10:58 AM కి ఉదయించి 2:40 PM కి అస్తమిస్తాడు. అంటే ఆరోజున అలస్కాలో 4 గంటల కంటే తక్కువ సేపు పగలు ఉంటుంది. అలాగే న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న రోచెస్టర్లో 8 గంటల 59 నిమిషాల 10 సెకన్ల పాటు పగటి వేళ ఉంటుంది(ఇక్కడ). 

టైమ్ అండ్ డేట్ వెబ్సైట్ ప్రకారం ఇదే రోజున ఢిల్లీలో 10 గంటల 19 నిమిషాల 17 సెకన్ల పాటు పగటి వేళ ఉండబోతుంది, అంటే 13 గంటల 40 నిమిషాల 43 రాత్రివేళ అనమాట. అలాగే, హైదరాబాదులో 11 గంటల 5 నిమిషాల 35 సెకన్లు పగటివేళ ఉండబోతుంది. కన్యాకుమారిలో ఇదే రోజు పగలు 11 గంటల 39 నిమిషాల 22 సెకన్ల ఉండబోతుంది. 

ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తా కథనం ప్రకారం 2019లో  శీతాకాల అయనాంతం డిసెంబర్ 22వ తారీఖున వచ్చింది, ఆ రోజు ఢిల్లీలో  10 గంటల 19 నిమిషాల 17 సెకన్ల పాటు పగటి వేళ ఉంది. ఉత్తర ధృవంలో అయితే శీతాకాల అయనాంతం రోజున అసలు వెలుతురే ఉండదు. దీన్ని బట్టి, శీతాకాల అయనాంతం రోజున పోస్టులో చెప్తున్నట్లుగా మన దేశంలో అన్ని ప్రదేశాల్లో 8 గంటల సేపు పగలు, 16 గంటల పాటు రాత్రి ఉండదు అని స్పష్టంగా అర్థం అవుతుంది. 

చివరిగా, శీతాకాల అయనాంతం రోజున ఉత్తరార్ధ గోళంలో ఉన్న అన్ని ప్రదేశాల్లో 16 గంటల పాటు రాత్రి 8 గంటల పగలు ఉండదు, ఇది ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది.