తెలంగాణలోని మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల(Graduates’), టీచర్ ఎమ్మెల్సీతో పాటుగా, నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలకు ఈ రోజు అనగా 27 ఫిబ్రవరి 2025 పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో “మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న అంజి రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇన్నోవా వాహనంలో కరీంనగర్‌కు తరలిస్తున్న రూ.16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు” అని పేర్కొంటూ ‘Way2News’ కథనం ప్రచురించట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2025 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి తరలిస్తున్న రూ.16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.
ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ 12 ఫిబ్రవరి 2025న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి తరలిస్తున్న రూ.16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి తరలిస్తున్న రూ.16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది.
ఈ వైరల్ ‘Way2News’ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/a7vv3k) ద్వారా ‘Way2News’ వెబ్‌సైట్‌లో వెతికితే, ఈ సంస్థ 26 ఫిబ్రవరి 2025న “ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం: CM” అనే టైటిల్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ‘Way2News’ ప్రచురించిన అసలైన వార్త కథనం దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఈ వైరల్ న్యూస్ క్లిప్ ఫోటోను రూపొందించారు అని నిర్థారించవచ్చు.
అంతేకాకుండా, ఈ న్యూస్ క్లిప్ వైరల్ అవడంతో, 26 ఫిబ్రవరి 2025న ‘Way2News’ సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ (ఆర్కైవ్డ్) ద్వారా స్పందిస్తూ,“ఇది Way2News ప్రచురించిన కథనం కాదు, కొందరు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చింది.
ఇంతకుముందు కూడా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి బీజేపీ పార్టీ పెద్దలకు రూ. 30 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ కొన్నాడని మరియు బీసీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు “తెలంగాణ న్యూస్ టుడే” పేరుతో ఒక న్యూస్ క్లిప్పింగ్ వైరల్ కాగా, అది ఫేక్ అని చెప్తూ Factly రాసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి తరలిస్తున్న రూ.16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ ‘Way2News’ కథనాన్ని ప్రచురించలేదు. అలాగే ఈ వార్త కూడా ఫేక్.