నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకు తెలిపినట్లు ‘Way2News’ వార్తా కథనం ప్రచురించలేదు

“సినీనటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకు తెలిపారు” అని ‘Way2News’ రిపోర్ట్ చేస్తూ కథనం ప్రచురించట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.   

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకు తెలిపారని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది. 

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 11 డిసెంబర్ 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. అలాగే, తమ కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి పేర్కొనట్లు ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకు తెలిపారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, మంచు లక్ష్మి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు.

పైగా, ఈ వార్తను ‘Way2New’s సంస్థ కూడా ప్రచురించలేదు. ఈ వైరల్ న్యూస్ క్లిప్‌ను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వార్తా కథనాన్ని ‘Way2News’ ప్రచురించలేదని తెలుస్తుంది. ఎందుకంటే, సాధారణంగా పబ్లిష్ అయిన ప్రతి ఆర్టికల్‌కు ప్రత్యేక ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు మరియు అంకెలతో కూడిన) కోడ్ ఉంటుంది. ‘Way2News’ ప్రచురించిన కొన్ని వార్త కథనాలను క్రింద చూడవచ్చు.

కానీ ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో అలాంటి ఆల్ఫా న్యూమరిక్ కోడ్/వెబ్ లింక్ ఏదీ లేకపోవడం మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ న్యూస్ క్లిప్‌ను ‘Way2News’ ప్రచురించలేదని, ఇది ‘Way2News’ లోగోను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి రూపొందించిన న్యూస్ క్లిప్ అని మనం నిర్ధారించవచ్చు.

అంతేకాకుండా, ఈ న్యూస్ క్లిప్ అవడంతో, 11 డిసెంబర్ 2024న Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ (ఆర్కైవ్డ్) ద్వారా స్పందిస్తూ,“ఇది Way2News ప్రచురించిన కథనం కాదు, తప్పుడు ఉద్దేశ్యంతో కొన్ని గ్రూపులు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయి” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చింది.

చివరగా, సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకు తెలిపినట్లు ‘Way2News’ వార్తా కథనం ప్రచురించలేదు. తమ కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి పేర్కొన్నట్లు ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం లేదు.