వీడియోలో ఉన్న ‘VTM NSS College’ యూనివర్సిటీ కాదు; ఆ కాలేజీలో ABVP గెలవడం ఇది మొదటిసారి కాదు

కేరళ రాష్ట్రంలో ఎంతో మంది హిందూ విద్యార్థులను ఊచకోత కోసి చంపిన చరిత్ర కేరళ యూనివర్సిటీది అలాంటి యూనివర్సిటీలో మొట్టమొదటి సారిగా కాషాయ జెండా ఎగురవేసిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) కేరళలో ఇది ఆరంభం మాత్రమే..!!” అని చెప్తూ, ఒక వీడియోతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళ యూనివర్సిటీలో మొట్టమొదటి సారిగా కాషాయ జెండా ఎగురవేసాక, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP) వేడుకలు జరుపుకుంటున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలో ఉన్నది ‘VTM NSS College’, అది యూనివర్సిటీ కాదు, కేరళ యూనివర్సిటీ అనుబంధ( అఫిలియేటెడ్‌) కాలేజీ మాత్రమే. అంతేకాదు, ఆ కాలేజీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP) ఇటీవల మొట్టమొదటి సారిగా గెలిచినట్టు పోస్ట్‌లో చెప్తున్న దాంట్లో కూడా వాస్తవం లేదు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అదే వీడియోని ‘ABVP Vtm Nss College Unit Dhanuvachapuram Trivandrum’ అనే ఫేస్బుక్ పేజీ 06 డిసెంబర్ 2022న పోస్ట్  చేసినట్టు తెలిసింది. వారు పెట్టిన పూర్తి వీడియో చూడగా, ఆ వీడియో ఆ కాలజీకి సంబంధించిందే అని తెలిసింది. ‘VTM NSS College’ యూనివర్సిటీ కాదు; అది కేరళ యూనివర్సిటీ అనుబంధ (అఫిలియేటెడ్‌) కాలేజీ మాత్రమే.

అంతేకాదు, ఆ కాలేజీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP) ఇటీవల మొట్టమొదటి సారిగా గెలిచినట్టు పోస్ట్‌లో చెప్తున్న దాంట్లో కూడా వాస్తవం లేదు. వరుసగా 25వ సారి ఆ కాలేజీలో ABVP గెలిచినట్టు చెప్తూ, 07 డిసెంబర్ 2022న ABVP ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఎటువంటి ప్రత్యర్థి లేకుండా ఆ కాలేజీ యూనియన్ ఎన్నికల్లో ABVP గెలిచినట్టు 2015లో ‘ABVP Kerala’ చేసిన ట్వీట్‌ని ఇక్కడ చూడవచ్చు. ఇటీవల జరిగిన కేరళ యూనివర్సిటీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ‘కేరళ కౌముది’ వారు ప్రచురించిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

చివరగా, వీడియోలో ఉన్న ‘VTM NSS College’ యూనివర్సిటీ కాదు. ఆ కాలేజీలో ABVP గెలవడం ఇది మొదటిసారి కాదు