వాతావరణ మార్పు గురుంచి నిరసన చేస్తున్న వారిని ప్యారిస్‌లో ప్రజలు రోడ్డుపై నుండి పక్కకు ఈడ్చివేసిన దృశ్యాలను తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు

రోడ్ల మీద #మసాజ్ (అర్థం చేసుకోండి జుకర్ గాడి దెబ్బకు అన్నీ మార్చాల్సి వస్తుంది) చేస్తున్న శాంతి మతస్తులకు ఈడ్చి అవతల పడేసి కాళ్ళతో తంటున్న ఫ్రాన్స్ ప్రజలు’ అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పోస్టు వివరణలో రాసిన మసాజ్ అనే అక్షరం నమాజ్ ను సూచిస్తుంది అని అర్ధం చేసుకోవచ్చు.  అసలు ఈ పోస్టులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: రోడ్ల మీద నమాజ్ చేస్తున్న ముస్లిం మతస్థులను ఈడ్చి పక్కన పడేసిన ఫ్రాన్స్ ప్రజలు.

ఫాక్ట్(నిజం): ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో కొందరు వాతావరణం కాలుష్యానికి వ్యతిరేకంగా రోడ్డు పైన ట్రాఫిక్ కి అడ్డంగా కూర్చొని నిరసన చేస్తుండగా, కొందరు వాహనదారులు వారిని పక్కకు ఈడ్చి వేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ముస్లింలు రోడ్డుపైన నమాజ్ చేస్తుంటే వారిని ఫ్రాన్స్ ప్రజలు పక్కకు ఈడ్చివేశారు అనే తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నరు. కావున ఈ క్లెయిమ్ తప్పు.

సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఫ్రాన్స్ లో రోడ్డుపై నుండి కొందరిని పక్కకు ఈడ్చివేసిన సంఘటనలపై ఏమైనా వార్త కథనాలు ఉన్నాయా అని ఇంటర్నెట్లో వెతకగా, వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు కలిగి ఉన్న ఒక వార్తా కథనం మాకు లభించింది. యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన ‘ఎక్సప్రెస్’ వార్తా సంస్థ వారి వెబ్సైటులో డిసెంబర్ 2వ తారీఖు ప్రచురితమైన ఈ కథనం ఇక్కడ చూడవచ్చు.

ఈ కథనం ప్రకారం ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో వాతావరణ కాలుష్యం గురించి వ్యతిరేకంగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని కొందరు నిరసన ప్రకటిస్తుండగా, కొందరు వాహనదారులు వారిని పక్కకు ఈడ్చివేశారు. కొన్ని నెలలుగా ఇటువంటి నిరసనలు జరుగుతున్నాయి అని ఆ వార్త కథనంలో రాసారు (ఇక్కడ మరియు ఇక్కడ). ఇదే విషయంపై ఉన్న ఇంకొన్ని వార్త కథనాలు మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. నవంబర్ 26వ తేదీన లేపారిసియన్ అనే వెబ్సైటులో ప్రచురితమైన ఈ వీడియోలో  కూడా వైరల్ వీడియోలో రోడ్డు పైనుండి నిరసనకారులని కొందరు వ్యక్తులు పక్కకు ఈడ్చివేస్తున్న దృశ్యాలని వేరే కెమెరా యంగిల్‌లో చూడవచ్చు. వీటన్నిటిని బట్టి, ఈ దృశ్యాలు కచ్చితంగా ఫ్రాన్సులో రోడ్డుపై నమాజ్ చేస్తున్న వారిని పక్కకు ఈడ్చివేసినవి కాదని అర్ధం అవుతుంది.

చివరిగా, వాతావరణ నిరసనకారులను (Climate activists) ప్యారిస్‌లో ప్రజలు రోడ్డుపైనుండి పక్కకు ఈడ్చివేసిన దృశ్యాలను నమాజ్ చేస్తున్న ముస్లింలను ఈడ్చివేసిన దృశ్యాలు అంటూ తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు.