మెక్సికో వీధుల్లో గుంపులుగా ఉన్న పక్షుల దృశ్యాలను జపాన్‌కి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

ఇటీవల టర్కీ, సిరియాలలో సంభవించిన భారీ భూకంపానికి కొంత సమయం ముందే పక్షులు వింతగా ప్రవర్తించాయని వస్తున్న కథనాల నేపథ్యంలో జపాన్‌లోని హోన్షు దీవిలో వేలాదిగా కాకులు వీధులలోకి వచ్చాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: జపాన్‌లోని హోన్షు దీవిలో వేలాదిగా కాకులు వీధులలోకి వచ్చిన దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియో మొదటగా 23 జనవరి 2023లో మెక్సికోకి చెందిన ‘Josue Resendiz’ అనే వ్యక్తి ‘టిక్ టాక్’లో అప్‌లోడు చేశాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన మెక్సికోలో జరిగింది. జపాన్ హోన్షు దీవిలో జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ అవుతున్న వీడియోల కింద కామెంట్లను పరిశీలించగా, ఈ దృశ్యాలు జపాన్‌కు చెందినవి కావని, మెక్సికోలో జరిగి ఉండవచ్చని కొందరు ట్విట్టర్ యూసర్లు అభిప్రాయపడ్డారు. దీని ఆధారంగా, మెక్సికోలో ఇటీవల ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా అని ఇంటర్నెట్లో వెతకగా, స్థానిక మీడియా ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ కథనాల ప్రకారం, మెక్సికోకి చెందిన ‘Josue Resendiz’ అనే వ్యక్తి 23 జనవరి 2023 నాడు దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ‘టిక్ టాక్’ యాప్‌లో అప్‌లోడు చేశాడు.

వీడియోలో కనిపించే కారు నెంబర్ ప్లేట్‌ని బట్టి మరియు ‘Josue Resendiz’ ఇన్స్టాగ్రామ్ పోస్టులని బట్టి అతను మెక్సికోలోని ‘Guanajuato’ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించవచ్చు. ఇక ఈ సంఘటన గురించిన మరిన్ని విషయాల కోసం మేము అతనిని సంప్రదించాము. తగిన సమాచారం అందిన వెంటనే ఈ కథనం అప్‌డేట్ చేయబడుతుంది.

చివరిగా, మెక్సికోలో వీధులలో గుంపులుగా ఉన్న పక్షుల దృశ్యాలని జపాన్‌కి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.