బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’ దృశ్యాలంటూ మహారాష్ట్రలో జరిగిన ఎడ్లబండ్ల పోటీ దృశ్యాలను షేర్ చేస్తున్నారు

బీహార్‌లో ఎన్నికల కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను, ఓట్ల రద్దును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ నిర్వహిస్తున్నారు. 17 ఆగస్టు 2025న ప్రారంభమైన ఈ యాత్ర బీహార్‌లోని దాదాపు 20 జిల్లాల్లో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు ప్రయాణించి, 2025 సెప్టెంబర్ 01న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ముగియనుంది (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, బీహార్‌లో సాగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న దృశ్యాలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆగస్టు 2025లో బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’కు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం బీహార్‌లో సాగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార యాత్ర’కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో జూన్ 2025లో మహారాష్ట్రలోని సతారా జిల్లా, పెడ్గావ్‌లోని హింద్‌కేసరి మైదానంలో జరిగిన ఎడ్లబండ్ల పోటీకి సంబంధించినది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగి ఉన్న వీడియో 23 జూన్ 2025న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో #Pedgaon #bullockcart #race #Field #pedgav #bailgada #shariyat #Maharashtra #bakasur #trending #gadamalak అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడింది. ఈ వీడియో యొక్క క్యాప్షన్ బట్టి ఈ వీడియో మహారాష్ట్రలో జరిగిన ఎడ్లబండ్ల పోటీకి సంబంధించినది అని తెలుస్తుంది. ఈ వీడియో 17 ఆగస్టు 2025న ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’కు ముందే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నందున, ఈ వీడియోకు బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’తో ఎటువంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

ఈ క్రమంలోనే 23 జూన్ 2025నవైరల్ వీడియోలోని దృశ్యాలనే చూపిస్తున్న మరో వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడినట్లు మేము గుర్తించాము. ఈ వీడియో వివరణలో  కూడా ఈ దృశ్యాలు మహారాష్ట్రలో జరిగిన ఎడ్లబండ్ల పోటీకి సంబంధించినవని పేర్కొన్నారు. దీని ఆధారంగా మరింత వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు కలిగి ఉన్న పలు వీడియోలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఇన్‌స్టాగ్రామ్‌లో కనుగొన్నాము. ఈ వీడియోల యొక్క వివరణలో కూడా, ఈ వైరల్ వీడియో జూన్ 2025లో మహారాష్ట్రలోని సతారాలోని పెడ్‌గావ్‌లోని హింద్‌కేసరి గ్రౌండ్‌లో జరిగిన ఎడ్లబండ్ల పోటీకి సంబంధించినవని పేర్కొన్నారు.

అలాగే, వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే,  జనంలో కొంతమంది ఎద్దుల చిత్రాలతో కూడిన టీ-షర్టులు ధరించి ఉండటం మనం చూడవచ్చు.

తదుపరి మేము మహారాష్ట్రలోని సతారా జిల్లా పెడ్‌గావ్‌లో ఉన్న హింద్‌కేసరి మైదానాన్నిగూగుల్ మ్యాప్‌లో జియోలొకేట్ చేశాము. అలాగే, వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలకు సరిపోలే ఓ ఫోటోను కూడా హింద్‌కేసరి మైదానం యొక్క గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇమేజరీకలో కనుగొన్నాము. ఈ ఫోటో జూన్ 2025లో అప్‌లోడ్ చేయబడింది.  

ఫాక్ట్-చెక్ సంస్థ ‘న్యూస్ చెకర్’  పెడ్గావ్‌లో జరిగిన ఈ ఎడ్లబండ్ల పోటీ నిర్వాహకులలో ఒకరిని సంప్రదించగా, వారితో నిర్వాహకుడు మాట్లాడుతూ, ఈ వీడియో 21 జూన్ 2025న పెడ్గావ్‌లోని హింద్‌కేసరి మైదానంలో జరిగిన ఎడ్లబండ్ల పోటీకి సంబంధించినదని ధృవీకరించారు. ఈ ఎడ్లబండ్ల పోటీకి సంబంధించిన పలు ఇతర వీడియోలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఆగస్టు 2025లో బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’ దృశ్యాలంటూ మహారాష్ట్రలో జరిగిన ఎడ్లబండ్ల పోటీకి సంబంధించిన దృశ్యాలను షేర్ చేస్తున్నారు.