మంచు గడ్డ మీద పెట్టిన పాలు మరుగుతున్న దృశ్యాలు అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మంచు గడ్డ మీద పెట్టిన పాలు మరుగుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొదలైన ఉత్తర భారత రాష్ట్రాల్లో నిర్వహించే కరహ పూజకు సంబంధించినవి. ఈ పూజలో భాగంగా పాలను మట్టి కుండల్లో పోసి పేడతో చేసిన పిడకలలో పెట్టి మరిగించాక ఆ కుండలను పెద్ద మంచు గడ్డలపై లేదా నీటిలో గానీ పెడుతారు. అలాగే, ఈ పూజలో భాగంగా దేవతలను ఆరాదిస్తూ పెద్ద పూజారులు మరుగుతున్న ఖీర్ (పాలు,అన్నంతో చేసిన పాయసం), పాలు, నెయ్యిలను తన ఒంటి పై పోసుకొంటారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొదలైన ఉత్తర భారత రాష్ట్రాల్లో నిర్వహించే కరహ పూజకు సంబంధించినవి. ఈ పూజ ప్రధానంగా నవరాత్రులలో నిర్వహించబడుతుంది.
ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అహిర్ (పశువుల కాపరులు), గదరియా (గొర్రెల కాపరులు) సమూహాలు ప్రత్యేకంగా ఆచరించే ఒక రకమైన కృష్ణుడి ఆరాధననే ఈ కరహ పూజ, ఈ పూజలో భాగంగా దేవతలను ఆరాదిస్తూ పెద్ద పూజారులు మరుగుతున్న ఖీర్ (పాలు,అన్నంతో చేసిన పాయసం), పాలు, నెయ్యిలను తన ఒంటి పై పోసుకొంటారు. దీని తరువాత, వారు అగ్నిదేవుడుని సంతోషపెట్టడానికి తమ తలను కూడా అగ్నిలోకి పెడుతారు.
ఈ కరహ పూజకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోల్లో పాలను మట్టి కుండల్లో పోసి పేడతో చేసిన పిడకలలో పెట్టి మరిగించాక ఆ కుండలను పెద్ద మంచు గడ్డల పై లేదా నీటిలో గానీ పెట్టడం మనం స్పష్టంగా చూడవచ్చు. అంతేగానీ, ఆ పాలు మంచు గడ్డలపై పెట్టడం వల్లన మరగడం లేదు. బాగా మరుగుతున్న పాలను అలా మంచు గడ్డల పై పెట్టిన కొంచెం సమయం మరుగుతూ పొంగుతూనే ఉంటాయి.
ఇలాంటి కరహ పూజలను రిపోర్ట్ చేస్తున్న పలు వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ వీడియోలోని దృశ్యాలు కరహ పూజకు సంబంధించినవి, ఈ పూజలో భాగంగా ముందుగానే మరుగుతున్న పాల కుండలను మంచు గడ్డలపై పెడతారు.