జెస్సికా రాడ్‌క్లిఫ్ అనే ట్రైనర్‌ను ఓర్కా జాతి డాల్ఫిన్ చంపిందంటూ AI వీడియోలను షేర్ చేస్తున్నారు

ఓర్కా జాతికి చెందిన ఒక డాల్ఫిన్ దాని ట్రైనర్ జెస్సికా రాడ్‌క్లిఫ్ అనే మహిళపై లైవ్ షో జరుగుతున్న సమయంలో దాడి చేసి చంపిందని చెప్తూ అనేక వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

ఇదే పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఓర్కా జాతి డాల్ఫిన్ జెస్సికా రాడ్‌క్లిఫ్ అనే ట్రైనర్‌పై దాడి చేసి చంపుతున్నప్పటి దృశ్యాలు. 

ఫాక్ట్:  జెస్సికా రాడ్‌క్లిఫ్‌ అనే ట్రైనర్‌పై ఓర్కా జాతి డాల్ఫిన్ దాడి చేసి చంపిందని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు. మెరైన్ పార్క్ లేదా అధికారులు అలాంటి సంఘటనను నివేదించలేదు. ఇటువంటి వైరల్ వీడియోలు కనీసం జనవరి 2025 నుండి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇవి వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు మహిళలను చూపిస్తున్నాయి. ఇవి AI ద్వారా రూపొందించబడిన వీడియోలు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఆగస్టు 2025లో ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగిందా అని ఇంటర్నెట్లో వెతకగా, మాకు ఎటువంటి విశ్వసనీయ సమాచారం లభించేలేదు. ఇటువంటి ఘటన జరిగినట్లు ఎక్కడా మెరైన్ పార్క్ లేదా అధికారుల నుండి ప్రకటనలు లేదా నివేదికలు లేవు.

ఇక వైరల్ వీడియోలను పరిశీలించగా, ఇదే తరహా వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) కనీసం జనవరి 2025 నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఓర్కా జాతి డాల్ఫిన్లు తమ ట్రైనర్లను చంపినట్లు ఈ వీడియోలలో చెప్పబడింది. 

అయితే, ఈ వీడియోలు Veo 3 వంటి AI సాధనలతో రూపొందించినట్లుగా వీడియోలపై ఉన్న వాటర్ మార్కు ద్వారా గుర్తించవచ్చు. 

SynthID, Hive వంటి సాధనలు కూడా వీటిని AI వీడియోలుగా గుర్తించాయి. అలాగే, కొన్ని వీడియోల కింద వివరణలో ఇవి AI వీడియోలని పేర్కొనబడింది. 

ఈ వీడియోలని మరింత గమనించగా, ఇందులోని డాల్ఫిన్లు వేర్వేరు మహిళలను వేర్వేరు ప్రదేశాల్లో దాడి చేస్తున్నట్లుగా ఉండడం చూడవచ్చు. దీన్ని బట్టి, ఇది నిజమైన ఘటనను చూపించే వీడియోలు కావని తెలుస్తుంది. 

అదనంగా, ఈ వీడియోలో మనుషుల ముఖాలు, చేతులు, అక్షరాలు అసహజంగా ఉండడం చూడవచ్చు. ఇవన్నీ AI వీడియోలలో ఉండే లక్షణాలు. 

అయితే, ఓర్కా జాతి డాల్ఫిన్లు గతంలో కొందరు ట్రైనర్లను గాయపరచడం లేదా చంపడం జరిగింది. వీటికి సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. 

చివరిగా, ఓర్కా జాతి డాల్ఫిన్ ట్రైనర్ దాని ట్రైనర్ జెస్సికా రాడ్‌క్లిఫ్ ను చంపిందంటూ AI వీడియోలను షేర్ చేస్తున్నారు.