బిల్ గేట్స్ 2025 మహా కుంభమేళాకు హాజరయ్యారని పేర్కొంటూ సంబంధం లేని విదేశీ పర్యాటకుడి పాత వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

మహా కుంభమేళా 13 జనవరి 2025న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుష్య పౌర్ణమి నాడు ప్రారంభమైంది. ఈ మహోత్సవం 26 ఫిబ్రవరి 2025న శివరాత్రి నాడు ముగుస్తుంది. ఈ మహా కుంభమేళాకు ఆపిల్ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ వంటి విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, “ప్రపంచ కుబేరులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2025 కుంభమేళా సందర్భంగా వారణాసిలోని మణికర్ణికా ఘాట్‌ను సందర్శించారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO బిల్ గేట్స్ ఇటీవల 2025 కుంభమేళా సందర్భంగా వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ను సందర్శించారు.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి బిల్ గేట్స్ కాదు. బిల్ గేట్స్ ఇటీవల 2025 కుంభమేళా సందర్భంగా భారతదేశాన్ని సందర్శించలేదని గేట్స్ ఫౌండేషన్ మీడియా సంబంధాల విభాగం PTI వార్తా సంస్థకు ఇమెయిల్ ద్వారా స్పష్టం చేసింది. అలాగే ఈ వీడియో డిసెంబర్ 2024 నుండి, అంటే 2025 మహా కుంభమేళా కంటే ముందు నుండే ఆన్‌లైన్‌లో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ వైరల్ పోస్టులో చెప్పినట్లుగా ఇటీవల 2025 కుంభమేళా సందర్భంగా బిల్ గేట్స్ వారణాసిలోని మణికర్ణికా ఘాట్‌ను సందర్శించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆయన 2025 కుంభమేళా సందర్భంగా వారణాసిని సందర్శించినట్లు కానీ, ఇటీవల భారతదేశానికి వచ్చినట్లు కానీ తెలిపే ఎటువంటి వార్తా కథనాలు/రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ ఆయన 2025 కుంభమేళాలో పాల్గొనడానికి భారతదేశానికి వచ్చి ఉంటే, పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా కథనాలను ప్రచురించేవి.

తదుపరి, మేము బిల్ గేట్స్ యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా తనిఖీ చేసాము. అక్కడ కూడా బిల్ గేట్స్ ఇటీవల 2025 కుంభమేళా సందర్భంగా వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ను సందర్శించినట్లు కానీ, ఇటీవల భారతదేశానికి వచ్చినట్లు కానీ మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. బిల్ గేట్స్ చివరిసారిగా ఫిబ్రవరి/మార్చి 2024లో భారతదేశాన్ని సందర్శించారు.

ఇకపోతే ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ‘Gulluck’ అనే యూట్యూబ్ ఛానెల్ 24 డిసెంబర్ 2024న  షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, వారణాసిలో బిల్ గేట్స్‌ను పోలిన విదేశీ పౌరుడిని ఈ వైరల్ వీడియో చూపిస్తుందని పేర్కొన్నారు. వారణాసిలోని  మణికర్ణిక ఘాట్‌ను సందర్శించిన “డూప్లికేట్ బిల్ గేట్స్” అని వ్యంగ్యంగా పేర్కొంటూ ఇదే వ్యక్తి యొక్క మరొక వీడియోను ఈ యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది.

వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తికి  బిల్ గేట్స్‌తో కొంత పోలికను కలిగి ఉన్నప్పటికీ, ఇద్దరినీ జాగ్రత్తగా పోల్చి చూస్తే వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి బిల్ గేట్స్ కాదని తెలుస్తుంది.

బిల్ గేట్స్ ఇటీవల 2025 కుంభమేళా సందర్భంగా వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ను సందర్శించారా? లేదా? అని ధృవీకరించడానికి వార్తా సంస్థ ‘PTI’ బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను సంప్రదించగా, గేట్స్ ఫౌండేషన్ యొక్క  మీడియా సంబంధాల విభాగం స్పందిస్తూ, బిల్ గేట్స్ ఇటీవల అనగా 2025 కుంభమేళా సందర్భంగా భారతదేశాన్ని సందర్శించలేదని స్పష్టం చేసింది.

మరో వార్త సంస్థ ‘ఆజ్ తక్’, ఈ వైరల్ వీడియో యొక్క ఒరిజినల్ అప్‌లోడర్ దీపాంకర్ యాదవ్‌ను సంప్రదించగా, వారితో  దీపాంకర్ మాట్లాడుతూ ఆయన 2024 నవంబర్‌లో వారణాసిని సందర్శించారని, అక్కడ మణికర్ణికా ఘాట్‌లో విదేశీ పర్యాటకుల బృందాన్ని చూశారని, వారిలో ఒకరు బిల్ గేట్స్‌ను పోలి ఉన్నారని వారికి చెప్పారు. అలాగే ఆ వ్యక్తిని చూపిస్తూ బిల్ గేట్స్ అంటూ ఒక వ్యంగ్య వీడియోను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ వ్యక్తి వద్ద భద్రతా సిబ్బంది ఎవరూ లేరని, అతడు ఒక సాధారణ విదేశీ పర్యాటకుడని దీపాంకర్ పేర్కొన్నాడు. 

చివరగా, బిల్ గేట్స్ 2025 మహా కుంభమేళాకు హాజరయ్యారని పేర్కొంటూ సంబంధం లేని విదేశీ పర్యాటకుడి పాత వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.