22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ). పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఆకుపచ్చ రంగు జెర్సీలు ధరించి, తెల్లటి చంద్రవంక గుర్తు ఉన్న ఆకుపచ్చ జెండాలను పట్టుకుని నినాదాలు చేస్తున్న పురుషుల గుంపును చూపిస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “కేరళలో ముస్లింలు పాకిస్తాన్ జెండాలను పట్టుకుని, పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు” అంటూ క్లెయిమ్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). మరో పోస్టులో “కేరళలోని కోజికోడ్ లో ముస్లిం లీగ్ అనే పార్టీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు లాగా దుస్తులు ధరించి పాకిస్తాన్ జెండాలతో, భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు” అని పేర్కొంటూ ఇదే వైరల్ వీడియోలలో ఒకదాని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేరళలో ముస్లింలు పాకిస్తాన్ జెండాలను పట్టుకుని, పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలు 16 ఏప్రిల్ 2025న కేరళలోని కోజికోడ్‌లో కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిర్వహించిన ర్యాలీకి సంబంధించినవి. ఈ వీడియోలో పచ్చ రంగులో కనిపిస్తున్నవి IUML పార్టీ జెండాలు, పాకిస్థాన్ జాతీయ జెండాలు కావు. అలాగే, IUML కార్యకర్తలు ధరించే జెర్సీలకు, పాకిస్తాన్ క్రికెట్ జట్టు జెర్సీకి ఆకుపచ్చ రంగు తప్ప మరే సారూప్యతలు లేవు. అంతేకాకుండా, ఇటీవల ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన తరువాత కేరళలో పాకిస్థాన్ అనుకూల ర్యాలీలు జరిగినట్లు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన తరువాత కేరళలో ముస్లింలు పాకిస్తాన్ జెండాలను పట్టుకుని, పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికగా, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ కేరళలో ఇలాంటి పాకిస్థాన్ అనుకూల ర్యాలీలు జరిగి ఉంటే ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
ఈ వైరల్ వీడియోలలోని దృశ్యాలను జాగ్రత్తగా గమనిస్తే, వీడియోలోని వారు ధరించిన ఆకుపచ్చ జెర్సీలపై ‘అరంగడి’ (ARANGADI) అని రాసి ఉండటం మనం గమనించవచ్చు. ‘అరంగడి’ అనేది కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా, కన్హంగాడ్ మునిసిపాలిటీ పరిధిలోని గ్రామం. అలాగే, ఈ వీడియోలో కనిపిస్తున్న జెండాలు, జెర్సీలపై ఉన్న చంద్రవంక చిహ్నం కూడా పాకిస్తాన్ జాతీయ జెండా కంటే భిన్నంగా ఉండటం మనం చూడవచ్చు. అంతేకాకుండా, వైరల్ వీడియోలోని జెండాలలో పాకిస్తాన్ జాతీయ జెండాపై కనిపించే తెల్లటి నిలువు గీత కూడా లేదు.
ఈ వీడియోలలో కనిపిస్తున్న పచ్చ రంగు జెండాలు IUML పార్టీ జెండాలు (ఇక్కడ). ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కేరళ రాష్ట్రంలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఒక రాజకీయ పార్టీ. IUML పార్టీ జెండాకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. IUML పార్టీ జెండాను పాకిస్థాన్ జాతీయ జెండాగా చిత్రీకరిస్తు తమ పార్టీ పై ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని IUML ఏప్రిల్ 2019లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది. దీన్ని బట్టి, వైరల్ వీడియోలో కనిపిస్తున్నవి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండాలు అని, పాకిస్తాన్ జాతీయ జెండాలు కాదని స్పష్టమవుతోంది.
అలాగే, IUML కార్యకర్తలు ధరించే జెర్సీలకు, పాకిస్తాన్ క్రికెట్ జట్టు జెర్సీకి ఆకుపచ్చ రంగు తప్ప మరే సారూప్యతలు లేవు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు జెర్సీలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
వీడియో-1:
ఈ వీడియోలో, IUML కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సాదిఖాలి షిహాబ్ తంగల్‌కు మద్దతుగా నినాదాలు చేయడం వినవచ్చు. వీడియోలో ఎక్కడా “పాకిస్తాన్” లేదా “పహల్గామ్” వంటి పదాలు మనకు వినిపించవు. ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ‘arangadi_official_page’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ 16 ఏప్రిల్ 2025న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియోను ‘కోజికోడ్’ అనే శీర్షికతో అప్‌లోడ్ చేశారు.
వీడియో-2:
ఈ వీడియోను కూడా ఇదే ఇన్‌స్టాగ్రామ్ పేజీ 29 ఏప్రిల్ 2025న షేర్ (ఆర్కైవ్డ్ లింక్) చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో “ముస్లిం లీగ్ (IUML) జెండా పాకిస్తాన్ జెండాకు తేడా కూడా తెలియని చాలా మంది మూర్ఖులను చూడటం బాధాకరం. ఈ ప్రదర్శన దేనికోసం అని మీకు ఖచ్చితంగా తెలిసిన తర్వాత మాత్రమే వ్యాఖ్యానించడానికి ప్రయత్నించండి. స్కామర్లు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి” అని పేర్కొన్నారు ( మలయాళం నుండి తెలుగులోకి అనువదించగా).
ఇదే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో, 15 ఏప్రిల్ 2025న సయ్యద్ సాదిఖాలి షిహాబ్ తంగల్ ఫోటోతో కూడిన ఒక బ్యానర్ షేర్ చేయబడింది. 16 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 3 గంటలకు కోజికోడ్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా IUML నిరసన నిర్వహిస్తున్నట్లు ఆ బ్యానర్‌లో ఉంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కోజికోడ్‌లో కొత్త వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా IUML 16 ఏప్రిల్ 2025 చేపట్టిన నిరసనకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేశారు. ఇందులో మనం వైరల్ వీడియోలలో ఉన్న వ్యక్తులను కూడా చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), 16 ఏప్రిల్ 2025న కోజికోడ్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా IUML భారీ నిరసన సభను నిర్వహించింది. దీన్ని బట్టి ఈ వీడియోలు 16 ఏప్రిల్ 2025న కేరళలోని కోజికోడ్‌లో కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా IUML నిర్వహించిన ర్యాలీకి సంబంధించినవని స్పష్టం అవుతుంది.
అలాగే మేము ఈ వీడియోలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, షఫీ చలియం, IUML కేరళ స్టేట్ సెక్రటరీ సంప్రదించాము, మాతో (Factly) మాట్లాడుతూ, “వైరల్ పోస్టులలో చేస్తున్న వాదన తప్పు, అవి IUML జెండాలు, ఈ వీడియోలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కోజికోడ్‌లో 16 ఏప్రిల్ 2025న IUML ర్యాలీకి సంబంధించినవి” అని పేర్కొన్నారు. అలాగే వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు కాసరగోడ్‌కు చెందిన IUML కార్యకర్తలని ఆయన స్పష్టం చేశారు.
చివరగా, ఈ వైరల్ వీడియోలు 16 ఏప్రిల్ 2025న కేరళలోని కోజికోడ్‌లో కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిర్వహించిన ర్యాలీకి సంబంధించినవి. ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్నవి IUML పార్టీ జెండాలు, జెర్సీలు.