“ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా శ్రీరామ్ కాలనీకి వెళ్లినప్పుడు,ఆమె జై శ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే, అక్కడ కూర్చున్న ముస్లింలు వెంటనే మీరు జై శ్రీరామ్ ఎందుకు అన్నారంటూ హంగామా చేశారు” అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా మాట్లాడుతున్నప్పుడు కొందరు వ్యక్తులు గొడవ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా శ్రీరామ్ కాలనీకి వెళ్లినప్పుడు,ఆమె జై శ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే, అక్కడ కూర్చున్న ముస్లింలు వెంటనే మీరు జై శ్రీరామ్ ఎందుకు అన్నారంటూ వ్యతిరేకించారు. అప్పుడు ఆతిశీ వెంటనే క్షమాపణలు చెప్పింది.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఆతిశీ మార్లేనా ఢిల్లీ విద్యా మంత్రిగా ఉన్నప్పుడు 9 మార్చి 2024న ఖజూరి ఖాస్ చౌక్ సమీపంలో ఉన్న శ్రీ రామ్ కాలనీలో పాఠశాల ప్రారంభించినప్పటిది. ఆతిశీ తన ప్రసంగంలో మొదట శ్రీరామ్ కాలనీ గురించి ప్రస్తావించలేదు. దీనిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమె మాట్లాడుతూ “నేను శ్రీ రామ్ కాలనీ నివాసితులకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను; ఈ పాఠశాల శ్రీ రామ్ కాలనీకి చెందిన పిల్లలకు, అలాగే ఖజూరి ఖాస్, కరవాల్ నగర్ మరియు సోనియా విహార్‌లకు చెందిన పిల్లలకు సేవలు అందిస్తుంది” అని మాట్లాడారు. ఆమె “జై శ్రీరాం” అని నినాదాలు చెయ్యలేదు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ పోస్టు గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, 9 మార్చి 2024న ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనను మేము కనుగొన్నాము. ఈ ప్రకటన ద్వారా ఈస్ట్ ఢిల్లీలోని శ్రీరామ్ కాలనీలో కేజ్రీవాల్ ప్రభుత్వం రెండు ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించిందని, ఈ సందర్భంగా అప్పటి విద్యాశాఖ మంత్రి ఆతిశీ మాట్లాడుతూ శ్రీరామ్ కాలనీలోని ఈ పాఠశాల ఢిల్లీలోని అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటని తెలిపారు అని తెలుసుకున్నాం.
దీన్ని ఆధారంగా తీసుకొని మరింత వెతికితే, ఢిల్లీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, GNCT యూట్యూబ్‌లో ప్రచురించిన వీడియో ద్వారా ఖజూరి ఖాస్ నార్త్ వెస్ట్ ఢిల్లీలో సర్వోదయ కన్యా/బాల్ విద్యాలయ స్కూల్ ప్రారంభోత్సవం 9 మార్చ్ 2024న ఆతిశీ చేత జరిపించినట్టు మేము కనుగొన్నాము. ఈ కార్యక్రమం యొక్క పూర్తి వీడియోను పరిశోధించినప్పుడు, 32:14 టైమ్‌స్టాంప్‌కు ఆతిశీ మార్లేనా తన ప్రసంగాన్ని భారత్ మాతా కీ జై, వందేమాతరం మరియు ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో ప్రారంభించినట్లు మేము కనుగొన్నాము. తరువాత 40:30 టైమ్‌స్టాంప్ వద్ద, అతిశీ ఖజూరి ఖాస్ పాఠశాల ప్రారంభోత్సవం గురించి చర్చిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఆమె మాట్లాడుతున్న సమయంలో, ఆతిశీ ఖజూరి ఖాస్ పాఠశాల గురించి ప్రస్తావించినప్పుడు అక్కడున్న కొంతమంది అభ్యంతరం తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ మహ్మద్ అమీల్ మాలిక్ వేదిక వెనుక నుండి ఆమె వద్దకు వచ్చి, “ఇది శ్రీ రామ్ కాలనీ పాఠశాల; శ్రీరాం కాలనీ అని చెప్పండి” అని సలహా ఇవ్వగా ఆతిశీ నివాసితులను కూర్చోమని కోరుతూ, “నేను శ్రీ రామ్ కాలనీ నివాసితులకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను; ఈ పాఠశాల శ్రీ రామ్ కాలనీకి చెందిన పిల్లలకు, అలాగే ఖజూరి ఖాస్, కరవాల్ నగర్ మరియు సోనియా విహార్‌లకు చెందిన పిల్లలకు సేవలు అందిస్తుంది” అని అన్నారు. ఆమె “జై శ్రీరాం” అని నినాదాలు చేసినట్లు వీడియోలో ఎటువంటి ఆధారాలు లేవు.
చివరిగా, “జై శ్రీరామ్” నినాదం చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా క్షమాపణలు చెప్పారని ఈ వీడియోలో చేస్తున్న వాదన ఫేక్.