కరెంట్ తీగ మీద పడి TTE విద్యుత్ షాక్‌కు గురైన వీడియోని ఇయర్ ఫోన్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

మొబైల్ ఇయర్ ఫోన్లో ఇంటర్నెట్ యాక్టివేట్ అయి ఉండటంతో రైల్వే స్టేషన్లోని హైటెన్షన్ కేబుల్ నుండి కరెంట్ సరఫరా అయి ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురైన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.        

YouTube Poster

క్లెయిమ్: రైల్వే స్టేషన్లో మొబైల్ ఇయర్ ఫోన్లను ఉపయోగించడం వలన ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురైన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన ఇటీవల పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. 07 డిసెంబర్ 2022 నాడు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో సుజన సింగ్ సర్దార్ అనే టికెట్ చెకర్ అధికారి (TTE), తన సహచర అధికారితో ప్లాట్ఫారంపై మాట్లాడుతుండగా, ఓవర్ హెడ్ వైరుతో జతచేసి ఉన్న ఒక కరెంట్ తీగ ప్రమాదవశాత్తూ తెగి అతని మీద పడటంతో విద్యుత్ షాక్‌కు గురైయ్యారు. కరెంట్ తీగ తెగిపోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియదని, రెండు తీగలు వేరొకదానితో తాకడంతో ఒక తీగ స్నాప్ అయి ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. వీడియోలోని ఘటన ఇయర్ ఫోన్లను ఉపయోగించడం వలన చోటుచేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NDTV’ వార్తా సంస్థ 08 డిసెంబర్ 2022 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఒక టికెట్ చెకర్ అధికారిపై (TTE) ప్రమాదవశాత్తూ కరెంట్ తీగ మీద పడటంతో అతను విద్యుత్ షాక్‌కు గురైన దృశ్యాలంటూ ‘NDTV’ ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది.

ఈ ఘటన గురించి రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 07 డిసెంబర్ 2022 నాడు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో సుజన సింగ్ సర్దార్ అనే TTE, తన సహచర అధికారితో ప్లాట్ఫారంపై మాట్లాడుతుండగా, ఓవర్ హెడ్ వైరుతో జతచేసి ఉన్న ఒక కరెంట్ తీగ ప్రమాదవశాత్తూ తెగి అతని మీద పడటంతో విద్యుత్ షాక్‌కు గురైనట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ఈ ఘటనకు సంబంధించి ఖారగ్పూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రాజేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “రెండు తీగలు వేరొకదానితో తాకడంతో ఒక తీగ స్నాప్ అయి కిందపడటంతో  టిటిఈ అధికారి విద్యుత్ షాక్‌కు గురైయ్యారు. ఈ దుర్ఘటనకు ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నాం,” అని తెలిపారు.

విద్యుత్ షాక్‌కు గురై తీవ్ర గాయాలకు గురైన సుజన సింగ్ సర్దార్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని ఖారగ్పూర్ DRM మహమ్మద్ సుజాత్ హష్మి ‘ఇండియా టుడే’కు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఖారగ్పూర్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక యొక్క స్క్రీన్ షాట్‌ని ఒక ఫేస్‌బుక్ యూసర్ షేర్ చేశారు. ఈ నివేదికలో సుజన సింగ్ సర్దార్ ఓవర్ హెడ్ వైర్ తల మీద పడటం వలన విద్యుత్ షాక్‌కు గురైనట్టు స్పష్టంగా తెలిపారు. మొబైల్ ఇయర్ ఫోన్లను ఉపయోగించడం వలన ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు.

చివరగా, ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో కరెంట్ తీగ మీద పడి TTE విధ్యుత్ షాక్‌కు గురైన వీడియోని ఇయర్ ఫోన్లను ఉపయోగించడం వలన చోటుచేసుకున్న ఘటనగా షేర్ చేస్తున్నారు.