రష్యా అధ్యక్షుడు పుతిన్ 2017 సిరియా పర్యటన సందర్భంగా ఆయనకు రక్షణగా రష్యా యుద్ధ విమానాలు ప్రయాణించిన వీడియోను ఆయన ఇటీవలి భారత పర్యటనకు చెందినదని తప్పుగా షేర్ చేస్తున్నారు

23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం 2025 డిసెంబర్ 4,5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశాన్ని సందర్శించారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ సందర్భంలో, ఆయన ప్రయాణిస్తున్న విమానానికి భారత వైమానిక దళ జెట్‌లు ఎస్కార్ట్ చేస్తున్న దృశ్యాలని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు, ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తన డిసెంబర్ 2025 పర్యటన సందర్భంగా రష్యా ప్రధాని పుతిన్ విమానానికి ఎస్కార్ట్ చేస్తున్న భారత వైమానిక దళ పైటర్ జెట్లు.

ఫ్యాక్ట్(నిజం): డిసెంబర్ 2017లో సిరియాలోని ఖ్మెయిమిమ్ వైమానిక స్థావరాన్ని అధ్యక్షుడు పుతిన్ సందర్శించినప్పుడు ఆయన విమానానికి రష్యన్ Su-30 ఫైటర్ జెట్‌లు ఎస్కార్ట్ చేస్తున్న వీడియో ఇది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, అందులో ఉన్న దృశ్యాలున్న 2017 నాటి సోషల్ మీడియా పోస్టులు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). Ria Novosti అనే రష్యా దేశ మీడియా సంస్థ వారు కూడా ఈ దృశ్యాలు ఉన్న వీడియోను 12 డిసెంబర్ 2017న అప్లోడ్ చేశారు. 

ఇది డిసెంబర్ 2017లో సిరియాలోని ఖ్మెయిమిమ్ వైమానిక స్థావరాన్ని పుతిన్ సందర్శించినప్పుడు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఆయన విమానాన్ని రష్యన్ Su-30 ఫైటర్ జెట్‌లు ఎస్కార్ట్ చేసినప్పుడు తీసిన వీడియో అని చెప్తున్న వార్తా కథనాలు మాకు ఒక కీవర్డ్ సెర్చ్ ద్వారా లభించాయి. 

వైరల్ వీడియో ఇంకా ఈ పాత వీడియోలకు మధ్య ఉన్న పోలికలను మీరు ఈ క్రింది ఫోటోలో చూడవచ్చు.

ఇక ఇటీవల 2025లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ను సందర్శించినప్పుడు భారత వైమానిక దళం ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఏమైనా పుతిన్ విమానాన్ని ఎస్కార్ట్ చేసిందా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.

చివరగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 2017 నాటి సిరియా పర్యటనకు చెందిన వీడియోను తన డిసెంబర్ 2025 భారత్‌ పర్యటనకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.