ఖతార్ లో పాలస్తీనాకి మద్దతుగా జరిగిన నిరసనల వీడియోని కేరళలోని వాయనాడ్ లో జరిగిందంటూ షేర్ చేస్తున్నారు

ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు జరిగిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు ‘Free Palestine’ అని రాసి ఉన్న ప్లకార్డ్స్ తో మలయాళంలో నినాదాలు చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ, ఈ వీడియో కేరళలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ ప్రాంతంలో పాలస్తీనాకి అనుకూలంగా జరిగిన నిరసనలకి సంబంధించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ ప్రాంతంలో పాలస్తీనాకి అనుకూలంగా జరిగిన నిరసనలకి సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఖతార్ లోని ‘ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్వాహాబ్’ మసీదు దగ్గర వివిధ దేశాలకు చెందిన ప్రజలు పాలస్తీనాకి మద్దతుగా నినాదాలు చేస్తూ నిరసనలు చేసిన సంఘటనకు సంబంధించింది. ఈ నిరసలకు సంబంధించి అనేక వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ వీడియోకి కేరళలోని వాయనాడ్ కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకి సంబంధించి యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఖతార్ లో పాలస్తీనాకి మద్దతుగా జరిగిన నిరసనలను రిపోర్ట్ చేసిన ఒక మలయాళీ న్యూస్ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోలో నిరసనలు జరుగుతున్న ప్రాంతంలో లైట్స్ తో వెలుగుతున్న స్తంభం, పోస్టులోని వీడియోలో నిరసనకారుల వెనకాల కనిపిస్తున్న స్తంభం ఒకేలా ఉండడం గమనించొచ్చు.

ఈ న్యూస్ వీడియో ఆధారంగా కీవర్డ్ సెర్చ్ చేయగా ఖతార్ లో పాలస్తీనాకి మద్దతుగా జరిగిన నిరసనలకు సంబంధించి ‘గల్ఫ్ మలయాళీ’ అనే మలయాళీ న్యూస్ పోర్టల్ తమ ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోలో పోస్టులోని వీడియో క్లిప్ కూడా ఉండడం గమనించొచ్చు. ఐతే ఈ వీడియోకి సంబంధించిన వివరణ ప్రకారం ఈ వీడియో  ఖతార్ లో పాలస్తీనాకి మద్దతుగా మలయాళీలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన సందర్భానిది.

ఈ నిరసనలకు సంబంధించి మరొక వార్తా కథనం ప్రకారం పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ప్రజలు ‘ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్వాహాబ్’ మసీదు కూడలిలో గుమిగూడారు. ఈ నిరసనలకు సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

‘ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్వాహాబ్’ యొక్క ఫోటోలలో కూడా పోస్టులోని వీడియో ఉన్న స్తంభం చూడొచ్చు. పైగా కేరళలోని వాయనాడ్ లో పాలస్తీనాకి సంఘీభావం తెలుపుతూ నిరసనలు జరిగినట్టు ఎటువంటి వార్తా కథనాలు అందుబాటులో లేవు. కాబట్టి పైన తెలిపిన వివరాల ప్రకారం పోస్టులోని వీడియో ఖతార్ లో జరిగిన నిరసనలకి సంబంధించిందని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఖతార్ లో పాలస్తీనాకి మద్దతుగా జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోని కేరళలోని వాయనాడ్ లో జరిగిందంటూ షేర్ చేస్తున్నారు.