గత సంవత్సరం కేరళలో CAA & NRCలకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల వీడియోని త్రిపుర మత ఘర్షణలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

ఇటీవల త్రిపురలో మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో త్రిపుర ముస్లింలకు మద్దతుగా కేరళ ముస్లింలు ర్యాలీ నిర్వహించారంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: త్రిపుర ముస్లింలకు మద్దతుగా కేరళలోని ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో జనవరి 2020లో కేరళలోని మనర్కాడ్‌లో CAA & NRCకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ వీడియోని పలు మలయాళీ వార్తా సంస్థలు కూడా గత సంవత్సరం రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి ఇటీవల త్రిపురలో జరిగిన మత ఘర్షణలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వైరల్ అవుతున్న వీడియో యొక్క ఎక్కువ నిడివిగల వెర్షన్ షేర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు మాకు కనిపించింది. ఈ వీడియోని 03 జనవరి 2020న షేర్ చేయగా, పోస్టులో పేర్కొన్న హ్యాష్‌ట్యాగ్‌ల (#rejectnrc #rejectcaa #Mannarkkad) ప్రకారం వీడియోలోని విజువల్స్ కేరళలోని మనర్కాడ్‌లో గత సంవత్సరం జరిగిన CAA & NRC వ్యతిరేక నిరసనలకు సంబంధించిందని అర్ధమవుతుంది.

అలాగే వీడియోలో నిరసనకారులు ప్రదర్శించిన బ్యానర్‌పై ‘Constitutional Protection Rally’ మరియు ‘03 January 2020’ అని రాసి ఉండడం చూడొచ్చు.

పైగా ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో 9:55 -10:27 టైంలో నిరసనకారులు ఒక అంబులన్స్‌కి దారి ఇవ్వడం చూడొచ్చు. ఈ వీడియోకి సంబంధించిన వార్తా కథనాల కోసం వెతికినప్పుడు, నిరసనకారులు అంబులన్స్‌కి దారిచ్చిన ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మలయాళీ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం జనవరి 2020లో ప్రచురించగా, కథనంలో చెప్తున్నదాని ప్రకారం ఈ ఘటన పాలక్కడ్‌లోని మనర్కాడ్‌లో CAA & NRC వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నప్పుడు జరిగింది. దీన్నిబట్టి వైరల్ అవుతున్న వీడియో 2020లో కేరళలో CAA & NRCకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించిందని, ఈ వీడియోకి ఇటీవల త్రిపురలో జరిగిన మత ఘర్షణలకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

మనర్కాడ్‌ లైవ్ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించిన ఇంకొక వెర్షన్ చూడొచ్చు. ఈ వీడియోలో వైరల్ వీడియో, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోని పోలిన విజువల్స్ చూడొచ్చు. ఐతే ఈ వీడియో వివరణ కూడా ఇది మనర్కాడ్‌లో CAA & NRCకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించిందనే చెప్తుంది.

చివరగా, గత సంవత్సరం కేరళలో CAA & NRCలకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోని త్రిపుర మత ఘర్షణలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.