కర్ణాటకలో యూనిఫాంలో ఉన్న పోలీసులు ఒక MLA పాదాలను మొక్కారు అనే వాదనలో నిజం లేదు; పోలీసులు మొక్కింది ఒక ఆధ్యాత్మిక గురువుకు

“యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు ఒక కర్ణాటక MLA పాదాలు మొక్కి, డబ్బు తీసుకున్నారు”  అని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోలో కారులో కూర్చున్న ఒక వ్యక్తి పాదాలను పోలీసులు తాకడం మనం చూడవచ్చు.  ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: యూనిఫాంలో ఉన్న కొంతమంది పోలీసులు కర్ణాటక MLA పాదాలను మొక్కుతూ డబ్బు తీసుకుంటున్న వీడియో.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తి సిద్ధనకోళ్ల శివకుమార్ స్వామీజీ. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఓ ఆధ్యాత్మిక గురువు. కర్ణాటక బాదామి జిల్లాలో యూనిఫాంలో ఉన్న ఆరుగురు పోలీసులు శివకుమార్ స్వామీజీ పాదాలను తాకి, డబ్బు తీసుకున్న తర్వాత వారిని బదిలీ చేశారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. కర్ణాటక శాసనసభ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుత అసెంబ్లీలో సిద్ధనకొల్ల స్వామీజీ అనే పేరుతో ఎవరూ ఎమ్మెల్యేగా లేరు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 14 మార్చి 2025న  Daijiworld News అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఇదే వీడియోను కలిగి ఉన్న పోస్ట్‌ను మేము కనుగొన్నాము. బాగల్‌కోట్‌లో ఒక స్వామీజీ పాదాలను తాకి, డబ్బు తీసుకున్నందుకు ఆరుగురు పోలీసులను బదిలీ చేశారని ఈ పోస్ట్ పేర్కొంది.

ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, మార్చి 2025 లో  ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, కర్ణాటకలోని బాదామి జిల్లాలోని ఆరుగురు పోలీసులు ఆధ్యాత్మిక నాయకుడు సిద్ధనకోళ్ల స్వామీజీ పాదాలకు నమస్కరించి డబ్బు తీసుకున్నారని, దీనిపై ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో, బాగల్‌కోట్ పోలీసు సూపరింటెండెంట్ వారిని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మేము 14 మార్చి 2025న TV9 కన్నడ యూట్యూబ్ ఛానెల్‌లో  సిద్ధనకోళ్ల స్వామీజీ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను కూడా కనుగొన్నాము. ఈ ఇంటర్వ్యూలో, స్వామీజీ ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, యూనిఫాంలో ఉన్న పోలీసులు ఆయన పాదాలు తాకిన సంగతి గురించి యాంకర్ ఆయనను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన సిద్ధనకోళ్ల స్వామీజీ, నమస్కారం చేసిన వారు మఠానికి చెందిన భక్తులని, అలా చేయకూడదని తనకూ తెలుసని, అయితే వారు వ్యక్తిగత నమ్మకంతో అలా చేశారని స్పష్టం చేశారు.

ఆయన రాజకీయ నాయకుడనే వాదనను పరిశీలించడానికి, మేము కర్ణాటక శాసనసభ అధికారిక వెబ్‌సైట్‌ను చూశాము. ప్రస్తుత అసెంబ్లీలో సిద్ధనకోళ్ల స్వామీజీ అనే పేరుతో ఎమ్మెల్యే ఎవరూ లేరని స్పష్టమైంది.

చివరిగా, కర్ణాటకలో యూనిఫాంలో ఉన్న పోలీసులు ఒక MLA పాదాలను మొక్కారు అనే  వాదనలో నిజం లేదు; పోలీసులు మొక్కింది ఒక ఆధ్యాత్మిక గురువుకు.