తనను ఆపినందుకు వీడియోలో పోలీసులను తిడుతున్న వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసువారు తెలిపారు

‘మొత్తం పోలీస్ స్టేషన్ బాంబుతో లేపేస్తానని లంగర్‌హౌస్ దగ్గర పోలీసులకే వార్నింగ్ ఇస్తున్న కాషాయ ఉగ్రవాది’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: లాక్ డౌన్ లో తన బండిని ఆపినందుకు లంగర్‌హౌస్ దగ్గర పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న కాషాయ ఉగ్రవాది వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో పోలీసులను తిడుతున్న వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, గతంలో అతను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందాడని ‘SHO Langer House’ పోలీసు వారు ట్వీట్ చేసారు. పోస్ట్ లో కాషాయ ఉగ్రవాది అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్టులోని వీడియో వైరల్ అవ్వడంతో ‘SHO Langer House’ పోలీసు వారు ఆ ఘటన పై వివరణ ఇస్తూ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్లు పెట్టారు. 30 ఏప్రిల్ 2020  పొద్దున ఏడు గంటలకు ఒక వ్యక్తి మాస్క్ మరియు హెల్మెట్ లేకుండా లంగర్‌హౌస్ వైపు వెళ్తుంటే పోలీసులు ఆపారని, తనను ఆపినందుకు ఆ వ్యక్తి పోలీసువారిని తిట్టడం మొదలుపెట్టడంతో అతనిని అదుపులోకి తీసుకున్నామని పోలీసువారు ట్వీట్ చేసారు. అయితే, అతని గురించి ఎంక్వయిరీ చేయగా, అతనికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, గతంలో అతను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందాడని తెలిసినట్టుగా వారు తెలిపారు. ఇదే విషయాన్ని చెప్తూ, ‘Hyderabad City Police’ వారు కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు.

చివరగా, తనను ఆపినందుకు వీడియోలో పోలీసులను తిడుతున్న వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసువారు తెలిపారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?