జగన్ 2014లో వేరే సంధర్బంలో చేసిన వ్యాఖ్యలను ఇతర వీడియోకి డిజిటల్ గా జోడించి షేర్ చేస్తున్నారు

YouTube Poster

తిరుపతిలో ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడరు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అంటున్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తిరుపతిలో ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడరు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అంటున్న వీడియో.

ఫాక్ట్(నిజం): 2014 ఎన్నికలకి సంబంధించి జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మహా నగరాలు ఎలా నిర్మిస్తామో వివరించే సందర్భంలో తిరుపతిపై చేసిన వ్యాఖ్యలను 2019లో ఢిల్లీలో జగన్ ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియోకి డిజిటల్ గా జోడించి షేర్ చేస్తున్నారు. గురించి కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విథంగా ఉంది.

పోస్టులోని వీడియో కోసం యూట్యూబ్ లో వెతకగా 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన తరువాత నిర్వహించిన ప్రెస్ మీట్ ని ప్రచురించిన వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ ప్రెస్ మీట్ ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి వీడియో కథనంలో 15.21-15.55  టైమ్‌స్టాంప్ లో జగన్ ముఖ కవళికలు అచ్చం పోస్టులోని వీడియోలో జగన్ ముఖ కవళికలు ఒకే విథంగా ఉండడం గమనించొచ్చు. ఐతే ఆంధ్రజ్యోతి కథనంలో ఆ టైమ్‌స్టాంప్ వద్ద జగన్ తిరుపతి గురించి కాకుండా తన ఢిల్లీ పర్యటనకు గల కారణాలు వివరిస్తుండడం చూడొచ్చు. ఆ ప్రెస్ మీట్ ని ప్రచురించిన ఇతర వార్తా కథనాలు పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం అర్ధమవుతుంది.

జగన్ తిరుపతి గురించి మాట్లాడిన వీడియోల కోసం యూట్యూబ్ లో వెతికే క్రమంలో మాకు 2014 ఎన్నికలకి సంబంధించి జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోలో 1:04:20 టైమ్‌స్టాంప్ వద్ద జగన్ ఆంధ్రప్రదేశ్ లో మహా నగరాలు ఎలా నిర్మిస్తామో వివరించే సందర్భంలో తిరుపతి గురించి పోస్టులోని వీడియోలో మనకు వినిపించే వ్యాఖ్యలు చేసాడు. ఈ ప్రెస్ మీట్ కి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి బట్టి, 2014లో ఇతర సందర్భంలో జగన్ తిరుపతి గురించి చేసిన వ్యాఖ్యలని 2019లో ఢిల్లీలో జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియోకి డిజిటల్ గా జోడించి ప్రచారం చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఫాక్ట్-చెక్ విభాగం తమ అధికారిక ట్విట్టర్ ఎకౌంటులో పైన తెలిపిన విషయాన్నే తెలుపుతూ ఫాక్ట్-చెక్ కథనాన్ని షేర్ చేసింది.

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, జగన్ 2014లో వేరే సంధర్బంలో చేసిన వ్యాఖ్యలను ఇతర వీడియోకి డిజిటల్ గా జోడించి షేర్ చేస్తున్నారు.