బహ్రైన్‌లో జరిగిన పాత ఘటన వీడియోని కేరళలో ఒక మహిళ గణేష్ విగ్రహాలను పగలగొడుతున్నట్లుగా షేర్ చేస్తున్నారు

బురఖా ధరించిన ఒక మహిళ గణేష్ విగ్రహాల్ని పగలగొడుతున్న ఒక వీడియో ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ సంఘటన కేరళలో జరిగినట్లుగా ఈ పోస్టులో పేర్కొన్నారు. ఇందులోని నిజానిజాలు ఇక్కడ చూద్దాం.

క్లెయిమ్: కేరళలో ఒక బురఖా ధరించిన మహిళ గణేష్ విగ్రహాల్ని పగలకొడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని సంఘటన 2020లో బహ్రైన్‌ దేశంలో జరిగింది, ఒక మహిళ ఆ దేశ  రాజధాని మనామాలోని ఒక సూపర్ మార్కెట్‌లో గణేష్ విగ్రహాల్ని పగలగొట్టింది. తన పైన చట్టపరమైన చర్యలు కూడా చేపట్టారు. ఈ ఘటన కేరళలో జరగలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

సరైన కీ వర్డ్స్ తోటి ఇంటెర్నెట్‌లో సెర్చ్ చెయ్యగా ఈ సంఘటనకి సంబంధించి 2020లో ప్రచురించిన అనేక వార్తా కథనాలు లభించాయి. టైమ్స్ అఫ్ ఇండియా వారి కథనంలో పొస్ట్‌లో ఉన్న అదే వీడియోని చూడవచ్చు.

కథనాల ప్రకారం, వీడియోలో చూపిస్తున్న సంఘటన బహ్రైన్‌ దేశ రాజధాని మనామాలో జరిగింది. 54 ఏళ్ళ ఒక మహిళ ఒక సూపర్ మార్కెట్ లో గణేష్ విగ్రహాల్ని పగలకొట్టింది. తను ‘ఇది ముస్లిం దేశం’ అని అన్నట్టు ఈ కథనాలతో చూడవొచ్చు .ఈ సంఘటనపై మరిన్ని కథనాల్ని ఇక్కడ, ఇక్కడ చదవచ్చు.

బహ్రైన్‌ దేశం యొక్క ఇంటీరియర్ మినిస్ట్రీ వారు చేసిన ట్వీట్‌లో, ఆ మహిళపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నిటి ఆధారంగా, బహ్రైన్‌లో జరిగిన ఒక సంఘటనని కేరళలో జరిగినట్లుగా తప్పుగా చెప్తున్నారు అని నిర్ధారించుకోవచ్చు.

చివరగా, బహ్రైన్‌ దేశంలో జరిగిన పాత ఘటన వీడియోని కేరళలో ఒక మహిళ గణేష్ విగ్రహాలను పగలగొడుతున్నట్లుగా తప్పుగా షేర్ చేస్తున్నారు.