వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వార్తా కథనాల ప్రకారం(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఈ గొడవల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). పరస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జంగిపూర్‌లో కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది(ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 150 పైగా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, ఒక యువకుడిని ఓ గుంపు దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌దని చెప్తూ కొంతమంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో ఒక యువకుడిపై ఒక గుంపు దాడి చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోకు పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో మార్చి 2025లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక సంఘటనను చూపిస్తుంది. ఖిల్ఖేత్ ఢాకాలో ఒక చిన్నారిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై ఓ గుంపు దాడి చేయడాన్ని ఈ వీడియో చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మార్చి 2025 నుండి ఇవే దృశ్యాలను చూపిస్తున్న అనేక సోషల్ మీడియా పోస్ట్‌లను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మేము కనుగొన్నాము. దీన్ని బట్టి, ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ హింసకు ముందే జరిగిందని స్పష్టమైంది. ఈ పోస్ట్‌లో, కొంతమంది ఇది బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటన అని పేర్కొన్నారు.
ఈ క్లూ ఆధారంగా, ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ మార్చి 2025లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఖిల్ఖేత్ ప్రాంతంలో జరిగింది. ఐదు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని 18 మార్చి 2025న పోలీసులు అరెస్టు చేసి, తీసుకెళ్తుండగా, కోపంలో ఉన్న ప్రజలు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి, యువకుడిని రోడ్డుపై లాగి కొట్టారు. గాయపడిన స్థితిలో, అతన్ని మొదట కుర్మిటోలా జనరల్ హాస్పిటల్‌కు, తరువాత ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. వార్త కథనాలు నిందితుడి పేరు జాన్ మియాగా పేర్కొన్నాయి .
ఈ సంఘటనలో పోలీసు సిబ్బందిపై కూడా దాడి జరిగిందని, వారు గాయపడ్డారని ఖిల్ఖెట్ పోలీస్ స్టేషన్ OC MD కమల్ హుస్సేన్ మీడియాకు తెలిపారు (ఇక్కడ, ఇక్కడ). పోలీసులపై జరిగిన ఈ దాడిలో 100 మందికిపైగా వ్యక్తులపై కేసు నమోదు చేశామని, అదే రోజు ఇద్దరిని అరెస్టు చేశామని కూడా ఆయన తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ క్లెయిమ్ ఫేక్ అని, ఈ సంఘటన మార్చి 2025లో బంగ్లాదేశ్‌లోని ఢాకా ఖిల్ఖేత్‌లో జరిగింది అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సైబర్ క్రైమ్ వింగ్ సోషల్ మీడియా ద్వారా ఒక వివరణ ఇచ్చింది (ఇక్కడ, ఇక్కడ).
చివరిగా, బంగ్లాదేశ్‌లో ఒక యువకుడిపై ఒక గుంపు దాడి చేస్తున్న వీడియోని పశ్చిమ బెంగాల్ వివాదానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.