Fake News, Telugu
 

మతిస్థిమితం కోల్పోయిన ఒక వ్యక్తి కేరళలో కరెంటు తీగల మీదుగా నడుస్తున్న వీడియోని ఒక దొంగ పారిపోతున్నట్లు షేర్ చేస్తున్నరు

0

ఒక దొంగ విద్యుత్ తీగల మీదుగా నడుస్తూ జనం నుండి పారిపోతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. విధ్యుత్ తీగల మీదుగా, చెట్లను పట్టుకొని ఒక వ్యక్తి కొంతమంది జనం నుండి పారిపోతున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక దొంగ విద్యుత్ తీగల మీదుగా నడుస్తూ జనం నుండి పారిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): బీహార్‌కు చెందిన ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి, కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లాలో ఇటీవల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైకెక్కి, విధ్యుత్ తీగల మీదుగా నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. 29 అక్టోబర్ 2022 నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. హోస్దుర్గ్ పోలీసులు ఈ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని స్నేహాలయా రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేశారు. ఈ వీడియోలో విద్యుత్ తీగల మీదుగా నడుస్తున్న వ్యక్తి దొంగ కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Onmanorama’ వార్తా సంస్థ 29 అక్టోబర్ 2022 నాడు తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. రిహాబిలిటేషన్ సెంటర్ నుండి పారిపోయిన 25 సంవత్సరాల ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి, కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లాలోని మువంగల్ ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైకెక్కి, విద్యుత్ తీగల మీదుగా నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యలంటూ ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

ఈ సంఘటనకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ ‘Onmanorama’ వార్తా సంస్థ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. బీహార్ రాష్ట్రం పాట్నా నగరానికి చెందిన ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి, 29 అక్టోబర్ 2022 నాడు కన్హన్‌ఘడ్ మునిసిపాలిటీ సమీపంలోని మువంగల్ ప్రాంతంలో, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైకెక్కి విధ్యుత్ తీగల మీదుగా నడుచుకుంటూ వెళ్తూ అక్కడి ప్రజలను భయాందోళనలకు గురి చేసినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఆ ప్రాంత నివాసులు, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (KSEB) సకాలంలో జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవడంతో అతని ప్రాణాలను రక్షించగలిగారని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

ఈ వ్యక్తి 28 అక్టోబర్ 2022 నాడు చేరువత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇదే మాదిరి దుస్సాహాసానికి పాల్పడటంతో, అక్కడి పోలీసులు అతన్ని స్నేహాలయా అనే రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేసినట్టు తెలిసింది. మరుసటి రోజు ఈ వ్యక్తి రిహాబిలిటేషన్ సెంటర్ నుండి పారిపోయి మువంగల్ ప్రాంతంలో విధ్యుత్ తీగల మీదుగా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. హోస్దుర్గ్ పోలీసులు ఈ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని మళ్ళీ స్నేహాలయా రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేశారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో విధ్యుత్ తీగల మీదుగా నడుస్తున్నది ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తని, దొంగ కాదని చెప్పవచ్చు.

చివరగా, కేరళలో మతిస్థిమితం కోల్పోయిన ఒక వ్యక్తి విధ్యుత్ తీగల మీదుగా నడిచిన వీడియోని ఒక దొంగ జనం నుండి పారిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నరు. 

Share.

About Author

Comments are closed.

scroll