జపాన్ ప్రభుత్వం ముస్లిం శ్మశానవాటికలను నిర్మించడానికి ‘నో’ చెప్పిందని చెప్తూ, ఆ దేశ కౌన్సిలర్ మిజుహో ఉమేమురా పార్లమెంటులో అడిగిన ప్రశ్న వీడియో తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు

జపాన్‌లో ముస్లిం శ్మశానవాటికలు నిర్మించడానికి జపాన్ ప్రభుత్వం తిరస్కరించిందని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేయబడుతోంది. ఒక పార్లమెంట్ వాతావరణంలో ఒక మహిళ మాటాడుతున్న వీడియో ఇది. దీన్ని ‘శ్మశానవాటికల కోసం ముస్లింల అభ్యర్థన తిరస్కరించబడింది. జపాన్‌లో, దహన సంస్కారాలు ఒక సంప్రదాయం. ముస్లింలకు ఇష్టం ఉంటే వాళ్ళ శవాలను ఇక్కడ క్రిమిటోరియమ్ లో దహనం చేసుకోవచ్చు..లేదా శవాలను  వారి స్వంత దేశాలకు తీసుకెళ్లి  అక్కడే పాతిపెట్టడం!..జపాన్  సాంప్రదాయాలు..ఆచారాలు ఒక మతం కోసం మారవు.. ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నియమాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసిన జపాన్ ప్రభుత్వం’ ” అని చెప్తూ షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్:  జపాన్‌లో ముస్లిం శ్మశానవాటికలు నిర్మించడానికి జపాన్ ప్రభుత్వం తిరస్కరించింది. దానికి సంబంధించిన వీడియో ఇది.

ఫ్యాక్ట్(నిజం): జపాన్ పార్లమెంటులోని చట్టసభ అయిన నేషనల్ డైట్‌లో మిజుహో ఉమేమురా అనే కౌన్సిలర్ ఆ దేశంలో చనిపోయిన వ్యక్తులకు దహన సంస్కరణే చేయాలని, దేశం మొత్తం ఖననాన్ని (సమాధులను) నిషేధించాలని కోరుతున్న వీడియో ఇది. దీనికి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో యూనో, జవాబు ఇస్తూ, ప్రస్తుతం జపాన్‌లో ఖననంపై నిషేధం పరిగణించబడటం లేదని చెప్పారు.  కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాకు జపాన్ దేశ హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ యొక్క సభ్యురాలైన మిజుహో ఉమేమురా పేరు మీద ఉన్న ఒక్క యూట్యూబ్ ఛానల్‌లో లభించింది

ఈ వీడియోలో కనిపిస్తున్నది మిజుహో ఉమేమురానే అని జపాన్ దేశ హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ వెబ్సైటులో ఉన్న ఆమె ఫోటో చూసి మేము నిర్ధారించుకున్నాము.  

వీడియో యొక్క వివరణ ప్రకారం, ఇది 27 నవంబర్ 2025న జరిగిన ఆరోగ్య, లేబర్, సంక్షేమ కమిటీ యొక్క ప్రశ్న-జవాబు సమావేశానికి చెందిన వీడియో. ఈ వీడియోలో మొత్తం నలుగురు వ్యక్తులు మాట్లాడటం మనం చూడవచ్చు. వారు ఏ విషయమై చర్చించుకున్నారో తెలుసుకోవడానికి Google వారి Notebook LM అనే ఆన్లైన్ టూల్ వాడి మీకు ఈ వీడియో యొక్క ఇంగ్లీష్ తర్జుమా పొందాము. 

దీని ద్వారా, ఈ సమావేశంలో మిజుహో ఉమేమురా (ఆమె Sanseitō party సభ్యురాలు) మాట్లాడుతూ, ఇస్లాం మతాన్ని విశ్వసించే ముస్లింలకు, ఖనన స్మశానవాటికలను అభివృద్ధి చేయాలనే ఒక ప్రతిపాదన వచ్చిందని అన్నారు. “ఈ రోజు, జపాన్‌కు ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ ఖనన స్థలాలు/స్మశానవాటికలు(burial grounds) అవసరం లేదని చెప్పడంతో పాటు నేను ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను” అని ఆమె అన్నారు. జపాన్‌లో చనిపోయిన వ్యక్తులను దహనం చేయడం ఒక ఆచారం అని, 2024లో 99.98% దహన సంస్కరణలు జరిగాయని చెప్పారు. ఖనన స్మశానవాటికలు నిర్మించడం వల్ల జపాన్‌కు హాని ఉందని, అక్కడ ఏదైనా ప్రకృతి విపత్తు జరిగితే ఖననం చేసిన దేహాలు బయట పడే/బహిర్గతం అయ్యే అవకాశం ఉందని ఆమె వాపోయారు. అందుచేత, జపాన్ కేంద్ర ప్రభుత్వం ఖననాన్ని ఆ దేశంలో నిషేధించాలని ఆమె ప్రతిపాదించించారు. 

అయితే, దీనికి జవాబుగా ఆ దేశ ఆరోగ్య, లేబర్, సంక్షేమ శాఖ మంత్రి కెనిచిరో యూనో మాట్లాడుతూ, చనిపోయిన వారి దేహాలను ఖననం చేసే ఆచారాన్ని నిషేధించడాన్ని వారు పరిగణించటం లేదని చెప్పారు. శ్మశానాల బయట మృతదేహాలను ఖననం చేయడం నిషేధం అని, దీనికి సంబంధించి స్థానిక ప్రభుత్వాలు తగిన నియమ నిబంధనలను పాటిస్తున్నాయని నేను నమ్ముతున్నాని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని మనం ఈ వీడియోను ఇంగ్లీష్ ఆడియో ట్రాక్ పెట్టుకొని వింటే అర్థం చేసుకోవచ్చు (ఇక్కడ, ఇక్కడ).

అదనంగా, ఒక కీవర్డ్ సెర్చ్ ద్వారా, ఈ సమావేశం యొక్క పూర్తి వీడియో మాకు జపాన్ దేశ ‘హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్’ యొక్క సమావేశాల యొక్క లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లు ఉండే వెబ్సైటు ‘webtv.sangiin.go.jp’ లో లభించింది.

అలాగే, జపాన్ భాష కీవర్డ్స్ ఉపయోగించి, ఈ సమావేశంలో జరిగిన చర్చ గురించి జపాన్ దేశ మీడియా సంస్థలు ఏవైనా వార్తా కథనాలు ప్రచురించాయా అని ఇంటర్నెట్‌లో వేతికాము. ఈ సెర్చ్ ద్వారా, ఉమేమురా అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి జపనీస్ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

ఈ వార్తా కథనాల ప్రకారం, ‘మేము ప్రస్తుతం ఖననాలను నిషేధించడం గురించి ఆలోచించడం లేదని’ కెనిచిరో యూనో చెప్పారు. పరిస్థితులు మారితే మేము ఏమైనా పరిగణనలోకి తీసుకుంటామేమో కానీ, ఇప్పుడైతే లేదని ఆయన చెప్పారు. అదనంగా, జపాన్‌లో ముస్లిం శ్మశానవాటికలను నిర్మించడానికి ఆ దేశ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.

చివరగా, జపాన్ ప్రభుత్వం ముస్లిం శ్మశానవాటికలను నిర్మించడానికి ‘నో’ చెప్పిందని చెప్తూ, ఆ దేశ కౌన్సిలర్ మిజుహో ఉమేమురా పార్లమెంటులో అడిగిన ప్రశ్న వీడియో తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.