ఇతరుల ఓట్లను ఒకే వ్యక్తి వేస్తున్న వీడియోను ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తూ, ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలలో జరిగిందని సోషల్ మీడియాలో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఓట్లు రిగ్గింగ్ చేస్తున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధించింది.
ఫాక్ట్: ఒక ఏజెంట్ ఇతరుల ఓట్లను వేసిన ఈ విజువల్స్ ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినది. ఈ వీడియోకు ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధంలేదు. వీడియోలో ఉన్న విజువల్స్ సౌత్ డమ్‌డమ్ మున్సిపాలిటీలోని 33వ వార్డ్ యొక్క 106వ బూత్ నుండి తీసినట్లు తెలుస్తుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక వీడియో యూట్యూబ్‌లో లభించింది. పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విజువల్స్ అని టీవీ9 బంగ్లా వారి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో 27 ఫిబ్రవరి 2022న అప్లోడ్ చేసారు. టీవీ9 బంగ్లా వారి ఈ వీడియో రిపోర్ట్ ప్రకారం, ఒక ఏజెంట్ ఇతరుల ఓట్లను వేసిన ఈ విజువల్స్, సౌత్ డమ్‌డమ్ మున్సిపాలిటీలోని 33వ వార్డులోని ఒక బూత్ నుండి తీసినవని తెలిపారు.
ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటికి, అటువంటి విజువల్స్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వారు తమ బెంగాల్ ట్విట్టర్ అకౌంట్లలో షేర్ చేస్తూ త్రినమూల్ కాంగ్రెస్ ఈ పని చేసిందని ఆరోపించారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ లో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. హింస, ఓటు రిగ్గింగ్ వంటి సంఘటనలు జరిగినట్టు వివిధ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి, మరియు సోషల్ మీడియా వేదికలలో షేర్ చేసాయి. వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్ సౌత్ డమ్‌డమ్ మున్సిపాలిటీలోని 33వ వార్డ్ యొక్క 106వ బూత్ నంబర్ నుండి తీసినట్లు తెలుస్తుంది.
చివరగా, ఈ విజువల్స్ పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించినవి, ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలతో సంబంధంలేదు.