భారత్‌లో హిందూ వ్యక్తిని ముస్లింలు హత్య చేశారంటూ బంగ్లాదేశ్ వీడియోని షేర్ చేస్తున్నారు

హిందూ వ్యక్తిపై ముస్లింలు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈ ఘటన భారత్‌లో జరిగినట్లుగా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భారత్‌లో హిందూ వ్యక్తిని ముస్లిం వ్యక్తులు హత్య చేస్తున్నప్పటి వీడియో.

ఫాక్ట్: ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 14 ఆగష్టు 2025న జరిగింది. రహత్ హుస్సేన్ రబ్బీ అనే వ్యాపారిని అబ్దుల్ మాలెక్ మున్నా అనే వ్యకి హత్య చేసినట్లు అంగీకరించాడు. అలాగే, ఈ కేసులో రెహ్మాన్ హంజా, మొహమ్మద్ మీర్ హుస్సేన్, మొహమ్మద్ ఫజల్ రబ్బీ, షబ్బీర్  అహ్మద్, అర్ఫత్ ఇస్లాం నిందుతులుగా ఉన్నారు. ఈ ఘటన భారత్‌లో జరగలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకి సంబంధించి పలు బంగ్లాదేశ్ వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, 14 ఆగష్టు 2025న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని శీషా బార్‌లో రహత్ హుస్సేన్ రబ్బీ అనే వ్యాపారి హత్యకి  గురయ్యాడు.

బంగ్లాదేశ్ పోలీసుల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ), ఈ ఘటనలో నిందుతులుగా ఉన్న అబ్దుల్ మాలెక్ మున్నా, రెహ్మాన్ హంజా, మొహమ్మద్ మీర్ హుస్సేన్, మొహమ్మద్ ఫజల్ రబ్బీ, షబ్బీర్ అహ్మద్, అర్ఫత్ ఇస్లాం అనే ఆరుగురు నిందితులని పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న అబ్దుల్ మాలెక్ మున్నా హత్య తానే చేశానని కోర్టులో అంగీకరించాడు. పై ఆధారాలను బట్టి ఈ ఘటన భారత్‌లో జరగలేదని, అలాగే ఇందులో బాధితుడితో పాటు నిందితులు కూడా ముస్లిం మతస్థులని నిర్ధారించవచ్చు.

చివరిగా, భారత్‌లో హిందూ వ్యక్తిని ముస్లింలు హత్య చేశారంటూ బంగ్లాదేశ్ వీడియోని షేర్ చేస్తున్నారు.