తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌పై రాష్ట్ర VAT రూపంలో రూ. 37 వసూలు చేస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 37 VAT రూపంలో వసూలు చేస్తుంది.
ఫాక్ట్ (నిజం): స్టేట్ VATని లీటర్ పెట్రోల్ ధర ఆధారంగా లెక్కించరు. కేవలం ఆయిల్ కంపెనీలు డీలర్లకు అందించే ధర + కేంద్ర ఎక్ష్సైజ్ డ్యూటీ + డీలర్ కమిషన్ మూడు కలిపితే వచ్చేదానిపైన రాష్ట్ర VATని లెక్కిస్తారు. తెలంగాణ ప్రభుత్వం VAT రూపంలో రూ. 27.45 వసూలు చేస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
08 మార్చ్ 2021న లోక్ సభ సమావేశాల్లో పెట్రోల్‌పై విధించే టాక్స్ లకు సంబంధించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి అప్పటి వరకు పెట్రోల్‌పై ఏ రాష్ట్రం ఎంత మేరకు VAT వసూలు చేస్తుందో వివరాలు అందించారు. పోస్టులో షేర్ చేసిన సమాచారం ఈ జవాబు నుండి సేకరించిందే.
ఈ సమాచరంలో తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ పై 35.2% రాష్ట్ర VAT వసూలు చేస్తుందని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా పెట్రోల్ ధర రూ. 105 ఉంటే, ఇందులో 35.2% రాష్ట్ర VAT అనగా రూ. 37 తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తుందనే నిర్ధారణకు వచ్చినట్టు అర్ధవుతుంది.

కాని నిజానికి రాష్ట్ర VATని ఆ రోజు పెట్రోల్ పంప్ లో లీటర్ పెట్రోల్ ధర ఆధారంగా లెక్కించరు. ఆయిల్ కంపెనీలు డీలర్లకు అందించే ధర + కేంద్ర ఎక్ష్సైజ్ డ్యూటీ + డీలర్ కమిషన్ మూడు కలిపితే వచ్చేదాని పైన రాష్ట్ర VATని లెక్కిస్తారు. ఉదాహారణకి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ వెబ్సైటులో 01 సెప్టెంబర్ 2021 నాటికి అందుబాటులో ఉన్న ప్రైస్ బిల్డ్ అప్ ని పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.

ఈ ప్రైస్ బిల్డ్ అప్‌లో ఢిల్లీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 30% (అనగా రూ. 23.4) రాష్ట్ర VAT విధిస్తుందని ఉంది. అలాగే అ రోజు ఢిల్లీలోని HP పెట్రోల్ పంప్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.39 అని ఉంది. కానీ పోస్టులో చెప్పినట్టు రాష్ట్ర VATని లీటర్ పెట్రోల్ ధర ఆధారంగా లెక్కిస్తే రాష్ట్ర VAT రూ. 30.4 అవ్వాలి (30% అఫ్ 101.39), కానీ ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర VAT రూపంలో రూ. 23.4 మాత్రమే వసూలు చేస్తుంది.
అదే, పైన చెప్పినట్టు ఆయిల్ కంపెనీలు డీలర్లకు అందించే ధర + కేంద్ర ఎక్ష్సైజ్ డ్యూటీ + డీలర్ కమిషన్ మూడు కలిపితే వచ్చేదాని ఆధారంగా రాష్ట్ర VATని లెక్కిస్తే ఢిల్లీలో రాష్ట్ర VAT సరిగ్గా రూ. 23.4 వస్తుంది. దీన్నిబట్టి, పోస్టులో రాష్ట్ర VAT లెక్కించిన పద్ధతి తప్పని అర్ధమవుతుంది. అదే విధంగా తెలంగాణలో పెట్రోల్ ధర (రూ. 105)లో 35.2% VAT అంటే రూ.37 అవుతుంది, కానీ నిజానికి స్టేట్ VAT రూ. 27.45 (35.2% అఫ్ (ఆయిల్ కంపెనీలు డీలర్లకు అందించే ధర + కేంద్ర ఎక్ష్సైజ్ డ్యూటీ+ డీలర్ కమిషన్)) మాత్రమే.
పెట్రోల్ పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల టాక్స్ లకిసంబంధించి FACTLY ఇంతకు ముందు రాసిన వివిధ కథనాలు ఇక్కడ చదవొచ్చు.
చివరగా, పెట్రోల్ మరియు డీజిల్ పై రాష్ట్రాలు వసూలు చేసే VAT శాతాన్ని వినియోగదారుడికి విక్రయించే ధరపై లెక్కించరు. తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై VAT రూపంలో రూ. 27.45 వసూలు చేస్తుంది, రూ.37 కాదు.