ఫ్లాక్స్ ఆయిల్‌ టాబ్లెట్‌లను వాడటం వలన లాభాలతో పాటు, దుష్ప్రభావాలు కూడా ఉంటాయి అని పరిశోధనలు చెప్తున్నాయి

ఫ్లాక్స్ ఆయిల్‌ను(అవిసె నూనె) ఒక థర్మాకోల్ ముక్క పైన వెయ్యగా అని కరిగిపోయిన వీడియో చూపెడుతూ, ఇదే విధంగా ఈ ఆర్గానిక్ ఫ్లాక్స్ ఆయిల్‌ టాబ్లెట్‌లను వేసుకుంటే రక్త నాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోయి గుండె జబ్బుల రాకుండా ఉంటాయి అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ‘Vestige’ కంపెనీకి చెందిన ఫ్లాక్స్ ఆయిల్‌ టాబ్లెట్లు వేసుకుంటే రక్త నాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోయి గుండె జబ్బుల రాకుండా ఉంటాయి.

ఫాక్ట్: కొన్ని పరిశోధనల ప్రకారం, అవిసె గింజలు మరియు అవిసె నూనె తీసుకోవడం వలన గుండెజబ్బు మరియు అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులకు ఆయా జబ్బులు  అదుపులో ఉండడానికి సహాయపడవచ్చు. ఈ టాబ్లెట్లు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని కొన్ని అధ్యయనాలు చెపితే, అంత ప్రభావం ఏమీ లేదు అని మరికొన్నిట్లో తేలింది. ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లు అయితే డయేరియా, గ్యాస్, అలెర్జీలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. గర్భంతో ఉన్నప్పుడు దీనిని నివారించాలి. దీనిని ఔషధంగా ఉపయోగించడానికి “Food and Drug Administration” అనుమతి ఇవ్వలేదు. బీపీ, షుగర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల కోసం టాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు ఈ ఆయిల్‌ ను తీసుకుంటే, రెండింటి మధ్య రియాక్షన్ జరిగే ప్రమాదం ఉంది. ఇక ‘vestige’ కంపెనీ అమ్ముతున్న ఈ ఉత్పత్తి పైన ఎక్కడా కూడా FSSAI, AYUSH లేదా CDSCO వంటి ప్రభుత్వ సంస్థల నుంచి గుర్తింపు ఉన్నట్లు లేబల్ కనిపించలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు దోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ ఫ్లాక్స్ ఆయిల్‌ గురించి వివిధ పరిశోధనలను ఏం చెప్తున్నాయో చూద్దాం. Mayo clinic, Cleveland Clinic మరియు WebMD లో ఇచ్చిన సమాచారం ప్రకారం,  అవిసె గింజలు(Flax seeds) మరియు వీటి నుండి తయారు చేసే ఈ అవిసె నూనె(Flax Oil)లో గుండెకు సహాయపడే ‘Alpha-linolenic Acid (ALA)’ అనే ‘omega-3 fatty acid’ ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, ఈ అవిసె గింజలు మరియు అవిసె నూనె తీసుకోవడం వలన గుండెజబ్బు మరియు అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులకు ఆయా జబ్బులు  అదుపులో ఉండడానికి సహాయపడవచ్చు అని తెలిసింది. కొలెస్ట్రాల్ విషయానికి వస్తే, ఈ నూనె తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని కొన్ని అధ్యయనాలు చెపితే, అంత ప్రభావం ఏమీ లేదు అని మరికొన్నిట్లో తేలింది. ఒకవేళ ఈ నూనె ఎక్కువ మోతాదులో తీసుకుంటే డయేరియా, గ్యాస్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. గర్భంతో ఉన్నప్పుడు దీనిని నివారించాలి. కొన్ని సార్లు ఈ నూనె వల్ల అలెర్జీలు కూడా వస్తాయి. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది కాబట్టి, సర్జరీకి రెండు వారాల ముందు ఈ నూనెను ఉపయోగించడం మానేయాలి. బీపీ, షుగర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల కోసం టాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు ఈ ఆయిల్‌ ను తీసుకుంటే, రెండింటి మధ్య రియాక్షన్ జరిగే ప్రమాదం ఉంది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ను ఔషధంగా ఉపయోగించడానికి “Food and Drug Administration” అనుమతి ఇవ్వలేదు.

ఇక వీడియోలో చూపించే దాని ప్రకారం, ఈ Flax Oil టాబ్లెట్లు  తయారు చేసిన కంపెనీ పేరు ‘Vestige Marketing Pvt Ltd’ అని తెలుస్తుంది. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. flipkart, amazon మరియు indiamart  ఉన్న ఫోటోలను గమనించగా, ఎక్కడా కూడా దీనికి FSSAI, AYUSH లేదా CDSCO వంటి ప్రభుత్వ సంస్థల నుంచి గుర్తింపు ఉన్నట్లు లేబల్ కనిపించలేదు.

మరియు థర్మాకోల్ ముక్కను ఈ నూనె కరిగించింది కాబట్టి శరీరంలో ఉన్న కొవ్వును కూడా అదే విధంగా కరిగించేస్తుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే థర్మాకోల్ మరియు కొలెస్ట్రాల్ రెండూ వేరు వేరు పదార్ధాలు. ఈ నూనెలో కరిగినట్లుగానే పెట్రోల్, అసిటోన్ వంటి రసాయనాల్లో కూడా థర్మాకోల్ సులువుగా కరిగిపోతుంది.

మొత్తానికి, ఫ్లాక్స్ ఆయిల్‌ టాబ్లెట్‌లను వాడటం వలన లాభాలతో పాటు, దుష్ప్రభావాలు కూడా ఉంటాయి అని వివిధ పరిశోధనలు చెప్తున్నాయి