భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) హ్యాకింగ్‌కు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ పేర్కొనలేదు

“భారతదేశంలో ఈవీఎం (EVM)లను హ్యాక్ చేస్తున్నారు, మా దగ్గర రుజువులు ఉన్నాయి” అని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో తులసి గబ్బర్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు) హ్యాక్ అయ్యే అవకాశం ఉందని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం చూడవచ్చు. ఈ వీడియోలో తులసి గబ్బర్డ్ “We have evidence of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections” అని అన్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) హ్యాక్ చేస్తున్నారని ఆధారాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చెప్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) హ్యాకింగ్‌కు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ పేర్కొనలేదు. ఈ వైరల్ వీడియో 10 ఏప్రిల్ 2025న జరిగిన అమెరికా క్యాబినెట్ సమావేశంలో అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ మాట్లాడిన దృశ్యాలను చూపిస్తుంది. వాస్తవానికి, ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, EVMs హ్యాకింగ్ గురి అయ్యే అవకాశం ఉందని, గతంలో అమెరికాలో EVMలు ఉపయోగించి నిర్వహించిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియో 10 ఏప్రిల్ 2025న జరిగిన అమెరికా క్యాబినెట్ సమావేశంలో అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ మాట్లాడిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ సమావేశంలో తులసి గబ్బార్డ్  మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్/ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్ గురి అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, అమెరికా వ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లకు మారాలని పిలుపునిచ్చారు. గతంలో అమెరికాలో EVMలు ఉపయోగించి నిర్వహించిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది. తద్వారా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ఈ విధానంలో ఫలితాలను తారుమారు చేయడానికి, దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని చెప్పేందుకు మా వద్ద పలు ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లను తీసుకురావాలనే మీ (ట్రంప్) ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే ఓటర్లు ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారు’ అని గబ్బార్డ్ పేర్కొన్నారు (ఇక్కడ).

వాస్తవానికి, ఈ వీడియోలో ఆమె గతంలో అమెరికాలో EVMలు ఉపయోగించి నిర్వహించిన ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్ గురి అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ అమెరికా వ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లకు మారాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు. ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

రిపోర్ట్స్ ప్రకారం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVM) హ్యాక్ చేయడం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయవచ్చన్న అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలను భారత ఎన్నికల సంఘం తప్పుబట్టింది. భారతదేశంలోని ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవని భారత ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంలను విదేశీ సందర్భంతో అనుసంధానించడం సరికాదని ఎన్నికల సంఘం పేర్కొంది. భారతదేశంలో ఉపయోగించే EVMలు కొన్ని దేశాలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఇక్కడ ఉపయోగించే EVMలు కాలిక్యులేటర్ల లాంటివి. దీనికి ఇంటర్నెట్, వైఫై లేదా ఇన్‌ఫ్రారెడ్ కనెక్టివిటీ లేదు. ఇందులో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. ఈ విషయంపై గతంలో సుప్రీంకోర్టు కూడా EVM ల విశ్వసనీయతను నిర్ధారించింది అని ECI వర్గాలు పేర్కొనాయని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

చివరగా, భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) హ్యాకింగ్‌కు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ పేర్కొనలేదు.