పచ్చిమ బెంగాల్లో SIR ప్రక్రియ మొదలవగానే పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు పారిపోతున్నారని సంబంధంలేని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు

పశ్చిమ బెంగాల్ సహా 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ రెండవ దశను  4 నవంబర్ 2025న ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్లోకి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులు తిరిగి తమ దేశానికి వెళ్లడం వలన బంగ్లాదేశీ రైళ్లు రద్దీగా మారాయని చెప్తూ కొన్ని వీడియోలు క్లిప్పులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోల్లో రైళ్ల పై భాగాన ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్లోకి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులు SIR కారణంగా తిరిగి తమ దేశానికి వెళ్లడం వలన బంగ్లాదేశీ రైళ్లు రద్దీగా మారడాన్ని చూపుతున్న వీడియోలు.

ఫాక్ట్: వైరల్ వీడియోలోని మొదటి రెండు క్లిప్‌లు కనీసం ఏప్రిల్, జూన్ 2024 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. మూడవ క్లిప్‌ మే 2022 నుంచి అందుబాటులో ఉంది. ఈ వీడియోలు బంగ్లాదేశ్‌లో రంజాన్ సమయంలోని రైళ్ల రద్దీని చూపుతుంది. పశ్చిమ బెంగాల్లో SIR ప్రక్రియ 4 నవంబర్ 2025 నుంచి మొదలైంది కాబట్టి వైరల్ వీడియో దీనికి సంబంధించినది కాదు. అయితే, బెంగాల్లో SIR ప్రక్రియ మొదలయ్యాక బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ తిరిగి వెళ్తున్న అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వార్తా కథనాలు పేర్కొన్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

క్లిప్ 1:

ముందుగా, వైరల్ వీడియోలోని మొదటి క్లిప్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) కనీసం ఏప్రిల్ 2024 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నట్లు గుర్తించాం.

రంజాన్ పండుగ సమయంలో ఏర్పడిన రద్దీ  కారణంగా బంగ్లాదేశ్‌లో ప్రయాణికులు రైలు పై భాగాన ప్రయాణం చేయడాన్ని ఈ వీడియో చూపుతుందని పలు వార్తా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నాయి.

క్లిప్ 2:

ఇక, రెండో వీడియో క్లిప్ గురించి వెతకగా, ఈ వీడియో కూడా కనీసం జూన్ 2024 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నట్లు గుర్తించాం. ఫిబ్రవరి 2025లో ఇదే వీడియోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాకి ముడిపెడుతూ కొందరు తప్పుడు ప్రచారం చేయగా, ఈ వీడియో బంగ్లాదేశ్‌లో ఢాకా ప్రాంతానికి చెందినదిగా నిరూపిస్తూ మేము రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లిప్ 3:

ఇక, చివరిగా వీడియో క్లిప్ గురించి వెతకగా, ఇది మే 2022 (ఇక్కడ & ఇక్కడ) నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నట్లు గుర్తించాం.

Daily Mail కథనం ప్రకారం, ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని బాలష్పూర్ ప్రాంతానికి చెందినది. రంజాన్ సమయంలో రద్దీని ఈ వీడియో చూపిస్తుంది.

పై ఆధారాలను బట్టి, వైరల్ వీడియోలోని మూడు క్లిప్‌లు పశ్చిమ బెంగాల్లో SIR ప్రారంభం కాకముందు నాటివని స్పష్టమవుతుంది. అయితే, పశ్చిమ బెంగాల్లో SIR ప్రక్రియ ప్రారంభమయ్యాక బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తున్న బంగ్లాదేశీ అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పినట్లు పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నాయి.

చివరిగా, పచ్చిమ బెంగాల్లో SIR ప్రక్రియ మొదలవగానే వేల సంఖ్యలో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు పారిపోతున్నారని సంబంధంలేని వీడియోలను షేర్ చేస్తున్నారు.