సంబంధం లేని వీడియోలు, ఫోటోలని కాబుల్ విమానాశ్రయం ఆత్మాహుతి దాడుల దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబుల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 26 ఆగష్టు 2021 నాడు రెండు జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఐసిస్‌-కె సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు కాబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఆత్మాహుతి దాడులలో ఇప్పటివరకు 90 మంది అఫ్గాన్ దేశస్థులు 13 మంది అమెరికా సైనికులు చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా యూసర్లు, కాబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు తీసిన దృశ్యాలు అంటూ తమ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్లలో కొన్ని వీడియోలు మరియు ఫోటోలని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలు, ఫోటోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాబుల్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న జంట ఆత్మాహుతి దాడుల యొక్క దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలలో, ఫోటోలలో కనిపిస్తున్నవి ఇటీవల కాబుల్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న జంట ఆత్మాహుతి దాడులకు సంబంధించిన దృశ్యాలు కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

వీడియో-1:

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Al Jazeera Egypt’ న్యూస్ ఛానల్ 22 ఆగష్టు 2021 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై దాడులు నిర్వహిస్తున్న దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ మరికొన్ని న్యూస్ సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కాబుల్ ఆత్మాహుతి దాడులకు సంబంధించినది కాదని స్పష్టమయ్యింది.

ఫోటో:

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ అఫ్గాన్ న్యూస్ సంస్థ ‘Pajhwok’ 15 మార్చ్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2021 మార్చ్ నెలలో కాబుల్ నగరంలో చోటుచేసుకున్న ఒక బాంబు దాడికి సంబంధించిన దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ఫోటోని ఇదే వివరణతో మరికొన్ని న్యూస్ సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని, ఇటీవల కాబుల్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న జంట పేలుళ్లకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియో-2:

‘ABN’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘BNO’ న్యూస్ సంస్థ 26 ఆగష్టు 2021 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. ఖజకిస్తాన్‌ దేశం తరజ్ నగరంలోని మిలిటరీ వెర్‌హౌస్‌లో మంటలు చేలరిగుతున్న దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు. ఇదే విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘RT’ న్యూస్ సంస్థ కూడా ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది.

ఈ వీడియోలో కనిపిస్తున్న మరొక దృశ్యం కూడా 16 ఆగష్టు 2021 నాడు కాబుల్ విమానాశ్రయంలో తీసిన ఫోటో అని తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలు కాబుల్ విమానాశ్రయంలో ఇటీవల చోటుసుకున్న ఆత్మాహుతి దాడులకు సంబంధించినవి కావని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని వీడియోలు మరియు ఫోటోలని కాబుల్ విమానాశ్రయం ఆత్మాహుతి దాడులకు జత చేస్తున్నారు.