కర్ణాటకలోని మత్తూర్‌లో రోజూ నగర సంకీర్తనలు జరుగుతున్నాయంటూ సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు

కర్ణాటకలోని మత్తూర్ అనే ఊరిలోని ప్రజలందరూ సంస్కృతంలోనే మాట్లాడుతారని, ఇక్కడ ప్రతిరోజు వేకువ జామున నగర సంకీర్తన జరుగుతుందని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: కర్ణాటకలోని సంస్కృత గ్రామంగా పిలవబడే మత్తూర్‌లో ప్రతిరోజూ వేకువ జామున జరిగే నగర సంకీర్తన దృశ్యాలు.

ఫాక్ట్: వీడియోలోని దృశ్యాలు కర్ణాటకలోని అశ్వతపుర పట్టణంలో 7 జనవరి 2021న చిత్రీకరించినవి. మైసూరుకు చెందిన రఘులీల సంగీత పాఠశాల విద్యార్ధులు ఇక్కడ ‘నగర సంకీర్తన’ అనే కార్యక్రమంలో పాల్గొనడం చూడవచ్చు. ఇక కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని మత్తూర్ గ్రామంలో కన్నడ భాషతో పాటు సంస్కృతం కూడా వ్యావహారిక భాషగా వాడుతారనేది వాస్తవమే అయినప్పటికీ ఈ దృశ్యాలు ఆ ఊరికి సంబంధించినవి కావు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ వీడియోని ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ‘RLSM – Raghuleela School of Music’ ఫేస్ బుక్ పేజ్ లో ఫిబ్రవరి 2021లో ‘అశ్వతపుర సంకీర్తన’ అనే పేరుతో ప్రత్యక్షప్రసారం చేసినట్లు కనుగొన్నాము.

మైసూరులో ఉన్న ఈ సంగీత పాఠశాల విద్యార్ధులు వివిధ సందర్భాలలో అనేక చోట్ల ‘నగర సంకీర్తన’ అనే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు అందరూ వీధుల్లో నడుస్తూ భక్తి పాటలు పాడుతారు. ఇందులో భాగంగానే, దక్షిణ కన్నడ జిల్లాలోని అశ్వతపురలో 7 జనవరి 2021న శ్రీ సీతారామ ఆలయం వద్ద జరిగిన నగర సంకీర్తనలో ఈ పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అవడంతో అనేక వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇక కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని మత్తూర్ గ్రామంలో కన్నడ భాషతో పాటు సంస్కృతం కూడా వ్యావహారిక భాషగా వాడుతారని అనేక సంస్థలు వార్తా కథనాలు ప్రచురించాయి. సంబంధిత వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అయితే పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ఊరికి సంబంధించినది కాదు. మరియు, అశ్వతపుర మత్తూర్ కు సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది.  

చివరిగా, సంబంధంలేని వీడియోని కర్ణాటకలోని మత్తూర్ లో వేకువ జామున నగర సంకీర్తనలు జరుగుతున్నాయంటూ షేర్ చేస్తున్నారు.