NASA వ్యోమగామి సునీతా విలియమ్స్, క్రూ-9 మిషన్ యొక్క వ్యోమగాములు 18 మార్చి 2025న SpaceX యొక్క డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు భూమిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌లో తిరిగొచ్చిన దృశ్యాలు అని చెప్తూ, సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. అసలు ఈ వీడియో వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: 18 మార్చి 2025న సునీతా విలియమ్స్, క్రూ-9 మిషన్ యొక్క వ్యోమగాములు తమ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమిపైకి చేరుకుంటున్నప్పుడు తీసిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోకి, సునీతా విలియమ్స్ క్రూ-9 మిషన్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇది 18 మార్చి 2025 కంటే ముందు నుంచే ఇంటర్నెట్లో ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియోను వెరిఫై చేయడానికి, ఇందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇదే వీడియో ఉన్న కొన్ని పాత సోషల్ మీడియా పోస్టులు దొరికాయి.
18 మార్చి 2025న సునీతా విలియమ్స్, తన టీమ్ భూమి పైకి SpaceX యొక్క డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో దిగిన సంఘటన కంటే ముందు నుంచే ఇవి ఇంటర్నెట్లో ఉన్నాయి. వీటిల్లో ముందుగా ‘Curiosidades do Universo FB’ ఫేస్‌బుక్ పేజీ వారు 1 ఫెబ్రవరి 2025న అప్లోడ్ చేశారు. దీనిబట్టి ఈ వీడియోకి క్రూ-9 రీ-ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదు అని మనకి స్పష్టం అవుతుంది.
NASA SpaceX యొక్క క్రూ-9 రీ -ఎంట్రీ, స్ప్లాష్‌డౌన్ ఈవెంట్ మొత్తాన్ని NASA వారు తమ అధికారిక యూట్యూబ్ ఛానల్లో, వెబ్సైటులో లైవ్ స్ట్రీమ్ చేశారు. క్రూ-9 మిషన్ యొక్క వ్యోమగాములు 18 మార్చ్ 2025న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సుమారు 5:57 p.m. EDT.కి భూమి పైకి చేరుకున్నారు.
ఇందులో వచ్చిన వారు నిక్ హాగ్, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, అలెక్సాండర్ గోర్బునోవ్. ఈ స్పేస్‌క్రాఫ్ట్ అమెరికాలోని ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో స్ప్లాష్‌డౌన్ అయ్యింది(నీళ్లల్లో పడింది).
ఈ లైవ్ స్ట్రీమ్, ఈ ఈవెంట్ యొక్క చాలా ఫోటోలలో వీరు వచ్చిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ మనం స్పష్టంగా చూడవచ్చు. దీనికి వైరల్ వీడియోలో కనిపిస్తున్న స్పేస్‌క్రాఫ్ట్/రాకెట్‌కి చాలా వ్యత్యాసం ఉంది.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు SpaceX వారి స్టార్‌షిప్ యొక్క రాకెట్ బూస్టర్‌ను చాప్స్టిక్స్ (రాకెట్ బూస్టర్‌లనుపట్టుకునే మెకానికల్ చేతులు) పట్టుకుంటున్న దృశ్యాల లాగా ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). కానీ ఈ వీడియోని ఎవరు, ఎప్పడు తీశారు అనే విషయాన్ని మాత్రం మేము వెరిఫై చేయలేక పోయాము.
అదనంగా, వైరల్ పోస్టులలో చెప్పినట్టు(నాసా కూడా చేతులు ఎత్తేసిన సమయంలో నేనున్నాను అని ఎలాన్ మస్క్ ముందుకు వచ్చి తాను సృష్టించిన స్పేస్ x సహాయంతో సునీతా విలియమ్స్ గారి టీమ్ నీ దివి నుంచి భువికి తీసుకొచ్చిన మగధీర ఎలాన్ మస్క్.) NASA చేతులు ఎత్తేయడంతో వీరిని కాపాడటానికి ఎలాన్ మస్క్ ముందుకు వచ్చారు అనే వాదనలో పూర్తి నిజం లేదు.
సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ యొక్క అసలు మిషన్ అయిన NASA’s Boeing క్రూ ఫ్లైట్ టెస్ట్(5 జూన్ 2024న లాంచ్ అయ్యింది), స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, వారిద్దరు లేకుండానే పూర్తయింది. ఈ నిర్ణయాన్ని NASA ఆగస్ట్ 2024లో ప్రకటించింది. అప్పుడే సునీతా, విల్మోర్‌లను NASA యొక్క కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగమైన క్రూ-9 మిషన్‌కి జోడించారు. క్రూ-9 మిషన్ అనేది NASA, SpaceX రెండు కలిసి భాగస్వాములుగా ఉండి చేపట్టారు.
అంతే గానీ వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గారిని NASA కాపాడలేక చేతులెత్తేస్తే, చివర్లో ఎలాన్ మస్క్ తాను తయారు చేసిన SpaceX సహాయంతో వారిని తీసుకొచ్చారు అని నాటకీయంగా చేస్తున్న వాదనలో వాస్తవం లేదు.
చివరగా, సునీతా విలియమ్స్, క్రూ-9 వ్యోమగాముల మార్చి 2025 నాటి లాండింగ్ వీడియో అని ఒక సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు.