చంద్రబాబు నాయుడు భద్రత దృష్ట్యా అనుమానితులని చంపమని NSGకి కేంద్ర హోం శాఖ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఎవరైనా హాని తలపెడుతున్నారని అనుమానమొస్తే కాల్చి పడేయమని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG) కమాండోలకు కేంద్ర హోం శాఖ పూర్తి అధికారాలను ఇచ్చిందంటూ చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారం లో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

YouTube Poster
ఇలాంటి పోస్టునే ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: చంద్రబాబు నాయుడుకి ఎవరైనా హాని తలపెడుతున్నారని సందేహం వస్తే కాల్చి పడేయమని NSG కమాండోలకు కేంద్ర హోం శాఖ పూర్తి అధికారాలు ఇచ్చింది.

ఫాక్ట్: కేంద్ర హోం శాఖ ఇటువంటి ఆదేశాలను ఎప్పుడూ ఇవ్వలేదు. ఆగస్టు 2022 లో 6+6 గా ఉన్న చంద్రబాబు భద్రతను 12+12 గా పెంచబడింది కానీ, అనుమానితులని చంపమని ఎక్కడా ఇటువంటి ఆదేశాలు జారీ కాలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, 26 ఆగస్టు 2022 న భద్రతా కారణాల దృష్ట్యా 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలుగా కేంద్ర ప్రభుత్వం పెంచింది. సంబంధిత మీడియా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఇటీవల చంద్రబాబుకి హాని తలపెడతారని అనుమానమొచ్చిన వ్యక్తులని కాల్చమని కేంద్ర హోం శాఖ కానీ, NSG కానీ అధికారికంగా ఎప్పుడూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చట్టం, 1986’ లో కూడా NSG భద్రత కల్పించే వ్యక్తులపై దాడి చేస్తారనే అనుమానంతో ఇతరులని చంపవచ్చని  ఎక్కడా కూడా చెప్పబడలేదు.

చివరిగా, చంద్రబాబు నాయుడుకి ఎవరైనా హాని తలపెడుతున్నారని అనుమానమొస్తే కాల్చి పడేయమని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG) కమాండోలకు కేంద్ర హోం శాఖ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.