పశ్చిమ బెంగాల్, కేరళకు సంబంధించిన రెండు పాత వీడియోలను హైదరాబాద్ కంచ గచ్చిబౌలి వివాదానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)ను పరిధిలో ఉన్న కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను భూమిని టీజీఐఐసీ (TGIIC) ద్వారా వివిధ ప్రాజెక్టులకు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 30 మార్చి 2025న ఈ భూములను జేసీబీలతో చదును చేసే పనులు ప్రభుత్వం ప్రారంభించగా, ఈ భూములు జింకలు, నెమళ్లు, తాబేళ్లు, పక్షులు సహా పలు రకాల వణ్యప్రాణులకు ఆవాసంగా ఉందని, పర్యావరణాన్ని నాశనం చేయొద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 03 ఏప్రిల్ 2025న ఈ భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో HCUలో జేసీబీని ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో ఓ ఏనుగు గాయపడిందని చెప్తూ ఒక వీడియోను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ HCUలో JCBని ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఏనుగు గాయపడినట్లు చూపిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న వీడియోకి,  హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూమి (HCU) వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలు రెండు వేర్వేరు సంఘటనలకు సంబంధించినవి. మొదటి వీడియో 01 ఫిబ్రవరి 2025న పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలోని దమ్‌డిమ్ ప్రాంతంలో స్థానికులు రెచ్చగొట్టడంతో అడవి ఏనుగు JCB మెషిన్ పై దాడి చేసింది. రెండవ వీడియో కేరళకు సంబంధించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా, అందులో @nammdeekeralam అనే ఇన్‌స్టాగ్రామ్ వాటర్‌మార్క్ కనిపించింది. దీని ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అతని పేరు వెతికితే, ఇదే గాయపడిన ఏనుగు వీడియోను ఆయన 17 ఫిబ్రవరి 2025న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించాం. అంటే ఈ వీడియో కంచ గచ్చిబౌలి వివాదం కంటే ముందే ఇంటర్నెట్‌లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

ఈ వీడియోపై పలువురు ప్రశ్నలు చేసిన సందర్భంలో, @nammdeekeralam కామెంట్స్‌లో స్పందిస్తూ– ఇది ఆరు వారాల క్రితం కేరళలో జరిగిన ఘటన అని, ఒక అడవి ఏనుగు, మరో ఏనుగుతో జరిగిన గొడవలో చిన్న గాయం పాలైంది అని తెలిపాడు. అయితే, మొదట్లో చిన్నగానే కనిపించిన ఆ గాయం, మట్టి, సూక్ష్మ క్రిముల కారణంగా కొద్ది రోజుల్లోనే పెరిగిపోయింది. గాయపడిన ఏనుగును చికిత్స చేసిన తర్వాత తిరిగి అడవిలో వదిలినప్పటికీ, అప్పటికే దాని పరిస్థితి మరింత విషమంగా మారింది. రెండవ సారి చికిత్స కోసం తీసుకెళ్లే సమయానికి, గాయం ఒక్క అడుగుపాటు లోతుగా ఉండి, ఇన్ఫెక్షన్ తొండం వరకూ వ్యాపించిందని అటవీ అధికారులు తెలిపారు. ఆ ఏనుగుకు అప్పటికప్పుడే వైద్యం అందించినా, గాయం తీవ్రంగా ఉండటంతో ఏనుగు మృతి చెందిందని తెలిపాడు.

ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, 21 ఫిబ్రవరి 2025న టైమ్‌లైన్ డైలీ లో ప్రచురించబడిన ఓ కథనం మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం,అతిరాప్పిళ్లై లో గాయం అయిన అడవి ఏనుగును 19 ఫిబ్రవరి 2025న చికిత్స కోసం కొదండ్ రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే రెండు రోజుల తర్వాత, 21 ఫిబ్రవరి 2025న అది అక్కడే మృతిచెందింది. రెండు నెలల క్రితం వెట్టిలప్పార దగ్గర నుదిటిపై చిన్న గాయంతో కనిపించిన ఈ ఏనుగుకు 24 జనవరి 2025న చికిత్స ఇచ్చి అడవిలోకి వదిలేశారు. కానీ గాయం పూర్తిగా మానకపోవడంతో, నుదిటిపై గాయం మరింత తీవ్రంగా మారింది. దాంతో మళ్లీ tranquilize చేసి కొడనాడ్‌కి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యులు ఇది బతికే అవకాశం చాలా తక్కువ, సుమారు 30 శాతం మాత్రమేనని చెప్పారు.

15 ఫిబ్రవరి 2025న EdPublica ప్రచురించిన ఓ వార్తా కథనంలో బురదలో గాయపడిన ఏనుగు వైరల్ వీడియోను మేము కనుగొన్నాము.

ఇకపోతే, ఏనుగు జేసీబీతో గుద్దుకుంటున్న వీడియోలోని కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ ఫిబ్రవరి 2025లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ , ఇక్కడ ,ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, 01 ఫిబ్రవరి 2025న పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా డాండిమ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు రెచ్చగొట్టిన నేపథ్యంలో ఓ అడవి ఏనుగు ముందు ఉన్న వారిపై దాడి చేసి, ఆ తర్వాత ఓ జేసీబీ మెషీన్‌పై దాడి చేసింది. అనంతరం జంతువును రెచ్చగొట్టి మెషీన్‌తో దాడి చేసిన వారిని మాల్బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. 

ఉన్న ఆధారాల ప్రకారం, ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌ ఘటనకు సంబంధించినదిగా స్పష్టమవుతోంది, దీనికి హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి వివాదంతో ఎలాంటి సంబంధం లేదు.

చివరిగా, పశ్చిమ బెంగాల్, కేరళకు సంబంధించిన రెండు పాత వీడియోలను హైదరాబాద్ కంచ గచ్చిబౌలి వివాదానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.