ఇటీవల (9 ఆగస్ట్ 2024) కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఒక ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో “కలకత్తాలో ఇటీవల రేపుకు గురైన అమ్మాయి చనిపోయే చివరి క్షణంలో తీసుకున్న వీడియో” అంటూ గాయాలతో ఉన్న ఒక అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: కోల్‌కతాలో ఇటీవల రేపుకు గురైన అమ్మాయి చనిపోయే చివరి క్షణంలో తీసుకున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): రేప్ చెయ్యబడ్డ అమ్మాయి అసలు ఫోటో వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి పోలికలతో మ్యాచ్ అవలేదు. పైగా పోలీసులు కానీ మీడియా కానీ ఎటువంటి చివరి క్షణంలో తీసిన వీడియోను గురుంచి ప్రస్తావించలేదు. కోల్‌కతా పోలీసుల కథనం ప్రకారం, ఆమె గాయాల తీవ్రత మరియు ఆమె మరణించిన పరిస్థితుల దృష్ట్యా, దాడి సమయంలో లేదా తర్వాత ఆమె తనను తాను రికార్డ్ చేసుకునే అవకాశం లేదు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు జీనత్ రహ్మాన్ అని ఒక పోస్టు కింద షేర్ చెయ్యటం మేము గమనించాం. అయితే, జీనత్ రెహ్మాన్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీ, ఫేస్బుక్ పేజీ అందుబాటులో లేవు. కాకపోతే , తన యూట్యూబ్ ఛానల్ వీడియోలు మరియు ఫోటోలు పరిశీలించగా జీనత్ రహ్మానుకు వైరల్ వీడియోలో ఉన్న మహిళకు మధ్య పోలికలు ఉన్నట్టు గమనించాం. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ అవుతున్న వీడియో గురించి వెతికితే, ఈ వీడియో మొట్టమొదట 15 ఆగస్ట్ 2024 నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు కనుగొన్నాం. ఈ వీడియోను పరిశీలించగా రేప్ చెయ్యబడ్డ అమ్మాయి యొక్క అసలు ఫోటో వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి పోలికలతో మ్యాచ్ అవలేదు. పైగా పోలీసులు కానీ మీడియా కానీ ఎటువంటి చివరి క్షణంలో తీసిన వీడియోను గురుంచి ప్రస్తావించలేదు.
కోల్‌కతా పోలీసుల కథనం ప్రకారం, ఆసుపత్రి ఆవరణలో ఆ మహిళ మృతదేహం దారుణమైన స్థితిలో కనుగొనబడింది. ఆమె గాయాల తీవ్రత మరియు ఆమె మరణించిన పరిస్థితుల దృష్ట్యా, దాడి సమయంలో లేదా తర్వాత ఆమె తనను తాను రికార్డ్ చేసుకునే అవకాశం లేదు (ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ వీడియో యొక్క సోర్స్ మేము కనుగొనలేకపోయాము. కానీ, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు జీనత్ రహ్మాన్ అని ఒక పోస్టు కింద షేర్ చెయ్యటం మేము గమనించాం. అయితే, జీనత్ రెహ్మాన్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజి మరియు ఫేస్బుక్ పేజి అందుబాటులో లేవు. కానీ, తన ఫేస్బుక్ పేజి బయోలో తాను ఒక ఆర్టిస్ట్ అని తెలుపడం మేము గమనించాం. మేము ఈ వీడియో గురించి స్పష్టత కోసం జీనత్ రెహ్మాన్ ను సంప్రదించడం జరిగింది. మేము తన ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాము.
బూమ్ లైవ్ ఫాక్ట్ – చెక్ సంస్థ వారు మేకప్ ఆర్టిస్ట్స్ అనే ఫేస్బుక్ పేజీలో జీనత్ రెహ్మాన్ తన మేక్ ఓవర్ వీడియోలు పోస్టు చేసినట్టు తెలిపింది. మేము ఈ పేజీని పరిశీలించగా, 2020లో జీనత్ అత్యాచారానికి వ్యతిరేఖంగా తాను గాయాలతో ఉన్నట్టు మేకప్ చేసుకొని ఒక పోస్టు ఈ పేజీలో షేర్ చేసినట్టు గమనించాం. అంతే కాకుండా, తన యూట్యూబ్ ఛానల్‌ను మేము కనుగొన్నాం. తాను పోస్టు చేసిన వీడియోలు మరియు ఫోటోలు పరిశీలించగా జీనత్ రహ్మానుకు వైరల్ వీడియోలో ఉన్న మహిళకు మధ్య పోలికలు ఉన్నట్టు మేము గమనించాం(ఇక్కడ మరియు ఇక్కడ). వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి మరియు జీనత్‌కు మధ్య పోలికను కింద చూడవచ్చు.
చివరిగా, వైరల్ వీడియోలో కనిపించే మహిళ కలకత్తాలో అత్యాచారానికి గురైన మహిళ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.