ఈ వైరల్ వీడియో 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు జరిగిన ఘర్షణను చూపిస్తుంది

“డిసెంబర్ 16, 1993 లో కేసరి నాథ్ త్రిపాఠి మరియు మరో 33 మంది అయోధ్య రామ మందిరం కోసం ప్రశ్నించిన బీజేపీ మరియు వారికీ సపోర్ట్ చేసిన హిందూ MLA లను కొట్టారు” అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 16 డిసెంబర్ 1993న కేసరి నాథ్ త్రిపాఠి, మరో 33 మంది MLA లతో కలిసి అయోధ్య రామ మందిరం కోసం ప్రశ్నించిన బీజేపీ, హిందూ MLA లను కొట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన ఘర్షణను చూపిస్తుంది. ఈ ఘర్షణకు, అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదు. అంతే కాదు, 1997 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కేసరి నాథ్ త్రిపాఠి కూడా బీజేపీ సభ్యుడే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న పలు వీడియోలు లభించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలను మీడియా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ (AP) జూలై 2015లో వారి యూట్యూబ్ ఛానల్ ‘AP ఆర్కైవ్’లో షేర్ చేసింది. ఈ వీడియోల వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియో 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన ఘర్షణను చూపిస్తుంది.

21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఎదుర్కొన్న విశ్వాస పరీక్షకు సంబంధించిన కథనాలను ప్రచురిస్తూ పలు ఇతర మీడియా సంస్థలు కూడా ఈ దృశ్యాలను రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

సెప్టెంబర్ 1996లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హంగ్ అసెంబ్లీకి దారితీశాయి. దీనితో ఉత్తరప్రదేశ్‌లో  అప్పటికే ఉన్న రాష్ట్రపతి పాలన కొనసాగింది. తరువాత, పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి సంకీర్ణ ప్రభుత్వని  ఏర్పాటు చేశాయి. తరువాత, బీజేపీ (BJP) & బీఎస్పీ (BSP) పార్టీలు 21 మార్చి 1997న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో భాగంగా, మాయావతి ముఖ్యమంత్రిగా మొదటి ఆరు నెలలు బీఎస్పీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని, ఆ తర్వాత ఆమె తదుపరి ఆరు నెలలు బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్‌కు అధికారాన్ని అప్పగిస్తుందని అంగీకరించారు. మాయావతి ఆరు నెలల పదవీకాలం తర్వాత, 1997 సెప్టెంబర్‌లో కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే, 19 అక్టోబర్ 1997న, మాయావతి బీఎస్పీ పార్టీ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

ఫలితంగా, అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ రోమేష్ భండారి, కళ్యాణ్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని ఆదేశించారు. 21 అక్టోబర్ 1997న, కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. స్పీకర్ కేసరి నాథ్ త్రిపాఠి నేతృత్వంలో మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యుడు కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ తమ పార్టీ నుండి విడిపోయే వర్గాన్ని స్పీకర్ గుర్తించడాన్ని నిరసిస్తూ గొడవకు దిగారు. వెంటనే కొంతమంది బీఎస్పీ సభ్యులు కూడా ఆయనతో కలిసి నిరసన తెలిపారు. ఈ గొడవ తీవ్రమై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు మైక్రోఫోన్లు, మైక్రోఫోన్ హ్యాండిల్స్, కుర్చీలు, టేబుల్ టాప్స్, బూట్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడి తిరిగి ప్రారంభమైంది. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 222 ఓట్లు, వ్యతిరేకంగా 0 ఓట్లు మాత్రమే వచ్చాయి (విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు). 21 అక్టోబర్ 1997న జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశం యొక్క ప్రొసీడింగ్స్ కాపీని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, 1997 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కేసరి నాథ్ త్రిపాఠి కూడా బీజేపీ సభ్యుడే (ఇక్కడ & ఇక్కడ).

చివరగా, ఈ వైరల్ వీడియో 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన ఘర్షణను చూపిస్తుంది.