వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ముర్షిదాబాద్‌లో జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారని కూడా మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ముర్షిదాబాద్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు 12 ఏప్రిల్ 2025న ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి 150 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
ఈ అల్లర్ల నేపథ్యంలో, “పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల చేతుల్లో తగలబడుతున్న హిందూ ఇళ్లు, ఆస్తులు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా, ముస్లిం మతానికి సంబంధించిన టోపీలు ధరించిన వ్యక్తుల సమూహం ఒకటి ఓ ఇంటిని చుట్టుముట్టి, దాని ధ్వంసం చేస్తూ దానికి నిప్పంటిస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియోను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలు హిందువుల ఇళ్ళు, ఆస్తులను తగలబెడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు, పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 22 మార్చి 2025న బంగ్లాదేశ్ పబ్నా జిల్లాలోని పబ్నా సదర్ ఉపజిల్లాలోని దోగచ్చి యూనియన్ ప్రాంతంలోని కాయెంకోలా అనే గ్రామంలో ఒక ముస్లిం ప్రార్థనా మందిరంపై కొందరు దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, సదరు ప్రార్థనా మందిరంలో అసభ్యకరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఈ దాడి జరిగింది. వార్త కథనాల ప్రకారం, 2025 ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టం, 2025 కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో హిందువులకు చెందిన పలు ఇళ్ళు ధ్వంసం చేయబడ్డాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ఫేస్‌బుక్‌లో ‘Jannat Prioty’ అనే బంగ్లాదేశీ యూజర్ 25 మార్చ్ 2025న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ పోస్టులో “దోగచ్చి యూనియన్‌లోని కాయెంకోలా పీర్ నివాసం కూల్చివేయబడింది” అని పేర్కొన్నారు. దోగచ్చి యూనియన్ బంగ్లాదేశ్‌లోని పబ్నా జిల్లాలోని పబ్నా సదర్ ఉపజిల్లాలోని ఒక ప్రాంతం (ఇక్కడ). ఈ పోస్టు వివరణ ప్రకారం, ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని పబ్నా జిల్లాకు సంబంధించింది అని తెలుస్తుంది.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, 23 మార్చి 2025న పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలు లభించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 22మార్చి 2025న, బంగ్లాదేశ్‌లోని పబ్నా జిల్లాలోని పబ్నా సదర్ ఉపజిల్లాలోని దోగచ్చి యూనియన్ ప్రాంతంలోని కాయెంకోలా అనే గ్రామంలో ఒక ప్రార్థనా మందిరాన్ని (ముస్లిం) ధ్వంసం చేసి నిప్పంటించారు. సదరు ప్రార్థనా మందిరంలో అసభ్యకరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఈ దాడి జరిగింది ఈ కథనాలు పేర్కొన్నాయి.
ఈ కథనాల ప్రకారం, కొన్ని సంవత్సరాల క్రితం, దిలావర్ హుస్సేన్ సయీద్ అనే వ్యక్తి తనను తాను సన్యాసినని చెప్పుకోవడం ప్రారంభించి తన ఇంట్లో ఒక ప్రార్థనా మందిరం నిర్మించుకున్నాడు. అశ్లీల విషయాలతో పాటు, ప్రార్థనా స్థలం ముసుగులో అతను మాదకద్రవ్యాలు వ్యాపారం చేస్తున్నాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, పోలీసులు అతన్ని ప్రార్థనా మందిరం మూసివేయాలని హెచ్చరించారు, కానీ హుస్సేన్ సయీద్ మందిరాన్ని మూసివేయడానికి నిరాకరించడంతో ఈ హింస చెలరేగింది .
వార్త కథనాల ప్రకారం, 2025 ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టం, 2025కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో హిందువులకు చెందిన పలు ఇళ్ళు ధ్వంసం చేయబడ్డాయి (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, ఈ వైరల్ వీడియోకు పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌లోని పబ్నా జిల్లాలో ఒక ముస్లిం ప్రార్థనా మందిరంపై కొందరు దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.