ఈ వైరల్ వీడియో మే 2025లో రాంచీ జిల్లాలోని బెడ్డోలో జరిగిన ఒక నిరసనను చూపిస్తుంది, ఈ నిరసనకు అదానీకి ఎటువంటి సంబంధం లేదు

“గొడవ చేయకుండా నోరుమూసుకుని మీ భూములు అదానీ కి ఇచ్చేయండి, లేదంటే దేశ ద్రోహుల కేసు పెట్టీ లోపల వేసేస్తాం” అని ఒక పోలీసు అధికారి చెప్తున్న దృశ్యాలంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గొడవ చేయకుండా భూములను అదానీకి అప్పగించమని పోలీసు అధికారి చెప్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో 31 మే 2025న జరిగిన ఒక నిరసనను చూపిస్తుంది. ఈ నిరసనకు అదానీతో ఎటువంటి సంబంధం లేదు. రాంచీ జిల్లాలోని బెడ్డోలో తమకు చెందిన 1.05 ఎకరాల భూమి అక్రమణకు గురైందని సర్నా అనే ఆదివాసీ (గిరిజన) తెగ ప్రజలు ఈ నిరసనను చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న ఆదివాసీ నేత శివం తిర్కామ్‌ (A1), Factly తో మాట్లాడుతూ, ఈ నిరసనకు అదానీతో ఎటువంటి సంబంధం లేదని, ఈ భూవివాదం చాలా ఏళ్లుగా నడుస్తుందని స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

 ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన అధిక నిడివి గల పలు వీడియోలను జూన్ 2025లో పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).  ఈ వీడియోల వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియో ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలోని బెడ్డోలో జరిగిన ఒక నిరసనను చూపిస్తుందని తెలిసింది.

దీని ఆధారంగా, ఈ వీడియోను షేర్ చేసిన అక్కడి స్థానిక జర్నలిస్టును సంప్రదించగా, ఈ వీడియో ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలోని బెడ్డోలో జరిగిన నిరసనను చూపిస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ నిరసనలో పాల్గొన్న సర్నా ఆదివాసీ నేత శివం తిర్కామ్‌తో మాట్లాడమని అతని ఫోన్ నంబర్ ఇచ్చాడు.

ఇదే విషయంపై గిరిజన నాయకుడు శివం తిర్కామ్‌ను సంప్రదించగా, ఆయన Factly తో మాట్లాడుతూ, ఈ నిరసనకు అదానీతో ఎటువంటి సంబంధం లేదని, రాంచీ జిల్లాలోని బెడ్డోలో తమకు చెందిన 1.05 ఎకరాల భూమి అక్రమణకు గురైందని సర్నా గిరిజన ప్రజలు ప్రభుత్వానికి చాలాసార్లు తెలియజేశారని, ప్రభుత్వ వర్గాల నుండి ఎటువంటి చర్య లేకపోవడంతో, తాము 31 మే 2025న, ఆ 1.05 ఎకరాల భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేయడానికి అక్కడకి వెళ్ళగా, అక్కడ పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది అని తెలిపారు. ఈ భూవివాదం చాలా ఏళ్లుగా నడుస్తుందని పేర్కొన్నారు.

ఈ భూవివాదం, దీనికి సంబంధించిన నిరసనలను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల ప్రకారం, 31 మే 2025 రాత్రి, ఆందోళన చేస్తున్న సర్నా గిరిజన ప్రజలు బెడ్డో పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు.

ఈ ఘటనపై గిరిజన నాయకుడు శివం తిర్కామ్‌ను A1 గా పేర్కొంటూ బెడ్డో పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, గొడవ చేయకుండా భూములను అదానీకి అప్పగించమని పోలీసు అధికారి చెబుతున్న దృశ్యాలంటూ మే 2025లో ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలోని  జరిగిన ఒక నిరసనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు